KC Venugopal To Hyderabad: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఆదివారం సాయంత్రం 6 గటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ కీలన నేతలతో ఆయన భేటీ కానున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రులు, పార్టీ నేతలు సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్న వారిని ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ ప్రచార వ్యూహాలు, విజయానికి సంబంధించిన అనుసరించిన వ్యూహాలపైన కేసీ వేణుగోపాల్ నాయకులకు దిశా, నిర్ధేశం చేయనున్నారు.
మేనిఫెస్టో అంశాలపై చర్చ
రానున్న ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రాలు వారీగా పార్టీ ముఖ్య నేతలతో ఏఐసీసీ కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ నేతలతో సమావేశమయ్యేందుకు వస్తున్న కేసీ వేణుగోపాల్.. అనేక కీలక అంశాలపై నాయకులకు సూచనలు చేయనున్నారు. ప్రధానంగా పాంచ్ న్యాయ్ గ్యారెంటీలు, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను నెల రోజుల్లో ఇంటింటికీ ఎలా తీసుకెళ్లాలన్న దానిపైనా చర్చలు జరపనున్నారు. ఏఐసీసీ ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరయ్యే సభలకు సంబంధించిన ఏర్పాట్లు, వాటికి సంబంధించిన షెడ్యూల్‌పైనా సమీక్షించనున్నారు. ఏఐసీసీ నిర్వహించిన సర్వల్లో నియోజకవర్గాలు వారీగా పార్టీ పరిస్థితిపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులపైనా ఆదివారం నిర్వహించనున్న సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సమావేశానికి పార్టీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కొనుగోలు కూడా హాజరుకానున్నారు.