Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
తెలంగాణలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఏప్రిల్ 22న తుది తీర్పు వెలువరించనుంది.

హైదరాబాద్: తెలంగాణలో అత్యంత కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు తీర్పు వాయిదా తీసింది. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ పిటిషన్లపై ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం, బుధవారం (ఏప్రిల్ 8) నాడే తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. అనివార్య కారణాలతో తీర్పు వెల్లడిని తెలంగాణ హైకోర్టు మరికొన్ని రోజులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణలో జరిగిన లోపాలు, అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో నంబర్ 6ను జారీ చేసింది. ఈ జీవో ద్వారా జస్టిస్ పి.సి.ఘోష్ అధ్యక్షతన బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, జరిగిన అవకతవకలపై విచారణ కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ సైతం విచారణ చేపట్టి నివేదిక రూపొందించింది. ఈ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్.కె.జోషిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ కీలక అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గతంలోనే సుదీర్ఘ విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున వాదనలు, ప్రభుత్వ తరపున వాదనలు పూర్తికావడంతో తుది తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఈ నెల 22కు వాయిదా పడటంతో, కాళేశ్వరం విచారణ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగానూ, సాంకేతికంగానూ ప్రాధాన్యత కలిగిన ఈ వ్యవహారంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది అటు బీఆర్ఎస్‌తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ ఉత్కంఠ నెలకొంది.
కాళేశ్వరం, దేవాదుల మోటార్లను పాడు చేస్తున్నారా? హరీశ్‌రావు లేఖ
ప్రతిష్టాత్మక కాళేశ్వరంతో పాటు దేవాదుల ప్రాజెక్టుల మోటార్లను కాంగ్రెస్ ప్రభుత్వం పాడుచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్, ఆఫ్ చేయడం వల్ల వాటి పనితీరు దెబ్బతింటుందని, కనీసం అవగాహన లేదా అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ప్రాజెక్టులకు సంబంధించిన భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఆన్ ఆఫ్ చేసి అశాస్త్రీయంగా వర్క్ చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్స్ పాడయ్యే ప్రమాదం ఉందని.. వీటిని గత తమ ప్రభుత్వంపై నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా అని లేఖలో ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యంగా భావించాలా ? లేక ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్రనా? అని నిలదీశారు.
భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసి ఉంటాయి. కానీ వాటిని పదే పదే ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేస్తే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు సరిగ్గా లేదన్నారు. మోటార్లను ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం శాస్త్రీయంగా ఆన్ ఆఫ్ చేయాలని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు




















