ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి, నట  విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారవు జయంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు, సినీ అభిమానులు, నివళి అర్పిస్తున్నారు. రాష్ట్రానికి, తెలుగు చిత్ర సీమకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమ సారథిగా ప్రజల గండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన చేసిన పాత్రలు నేటికీ స్ఫూర్తిదాయమంటూ అభిప్రాయపడుతున్నారు. 


ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయనతోపాటు సోదరుడు రామకృష్ణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ..."టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే ఓ వ్యక్తి కాదు శక్తి . సినిమాల్లో రారాజుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు."


అంతకంటే ముందు ఘాట్‌ను జూనియర్ ఎన్టీఆర్‌ సందర్శించి తాతకు నివాళి అర్పించారు. ఆయనతోపాటు కల్యాణ్‌ రామ్‌ కూడా ఉన్నారు. ఆయన రాకను ముందుగానే తెలుసుకున్న అభిమానులు భారీగా ఘాట్‌కు తరలి వచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అవేమీ పట్టించుకోని ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ తమ తాత సమాధి వద్ద పుష్పాలు అలంకరించి నివాళి అర్పించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


సంకల్పం తీసుకుందాం - చంద్రబాబు పిలుపు
తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి...అన్న ఎన్టీఆర్. ఆ మహనీయుడి 101వ  జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. "క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయి. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్...తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు  వేశారు. ప్రజల వద్దకు పాలనతో  పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారు. 


ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం...ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం." అని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నేతలకు పిలుపనిచ్చారు చంద్రబాబు


"సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి... రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి... వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు... యుగపురుషుడు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు" అంటూ ట్వీట్ చేసింది తెలుగుదేశం పార్టీ. తన అఫీషియల్ పేజ్ నుంచి ఈ పోస్టు పెట్టింది.