Jubilee Hills By Election: బీసీలకే జూబ్లీహిల్స్ సీటు.. కాంగ్రెస్ టికెట్ రేసులో నలుగురిలో ముందున్నది ఎవరు?
Jubileehills By Polls | మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలోజూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలుపై ప్రచారం చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించారు.

హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను సైతం కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలంతా కలసిమెలసి పనిచేయాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ప్రజాభవన్ గెస్ట్ హౌస్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. ఉపఎన్నిక ప్రచారం కోసం క్షేత్రస్థాయిలో నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలను, ప్రజలకు వివరించాల్సిన పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు.
సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీల అమలును ప్రచారం చేయాలి
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరై నేతలకు మార్గదర్శక సూచనలు చేశారు. కాంగ్రెస్ నేతల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, జూబ్లీహిల్స్ యోజకవర్గ నేతలు, తదితరులు పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆరు గ్యారంటీ హామీలు, ఇతరత్రా ప్రాజెక్టుల గురించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

బీసీలకే జూబ్లీహిల్స్ టికెట్..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి రేసులో నలుగురు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ నేడు ఏఐసీసీకి పంపనుంది. వీరిలో ఒకరికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిగా ఏఐసీసీ అవకాశం ఇవ్వనుంది. బీసీలకే ఆ టికెట్ ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏఐసీసీని కోరుతున్నారు. 2014ల జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసిన అనుభవంఉన్న నవీన్ యాదవ్‌పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ మేయర్‌గా చేసిన అనుభవం ఆయన సొంతం. గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా గెలిచారు. జూబ్లీహిల్స్ డివిజన్ కిందకు వచ్చే రహమత్‌నగర్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా గెలిచిన సీఎన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావులకు పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించింది.
బిహార్ ఎన్నికల పరిశీలకుడిగా మంత్రి పొంగులేటి
హైదరాబాద్ : త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 41 మంది పరిశీలకులను నియమించగా తెలంగాణ నుంచి మంత్రి పొంగులేటి ఒక్కరికి చోటు దక్కింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కూటమిని గద్దె దింపుతామని రాహుల్ గాంధీ ధీమాగా ఉన్నారు. కానీ నకిలీ ఓట్ల కారణంగా ఎన్నికల ఫలితాలు మారతాయని.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు గడువు ఇచ్చిన సమయంలో ఫిర్యాదులు రాలేదని ఎన్నికల సంఘం కొన్ని రోజుల కిందట తెలిపింది.






















