Janmabhoomi Express Latest News: విశాఖపట్నం- లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి మళ్లీ స్టేషన్ మార్చేశారు. ఇకపై అది సికింద్రాబాద్ వెళ్లదు. చర్లపల్లి మీదుగా లింగంపల్లి వెళుతుంది. ఏప్రిల్ 25 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని రైల్వేశాఖ ప్రకటించింది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి ఇలా స్టేషన్లు మార్చడం ఇది తొలిసారి కాదు. ఆ మాటకొస్తే ఆ ట్రైన్ అసలు పేరు కూడా అది కాదు. ఇప్పటికే చాలాసార్లు ఆ ట్రైన్ డెస్టినేషన్స్ మారుతూ వచ్చాయి. 
అవేంటో చూద్దామా?


చంద్రబాబు విజ్ఞప్తితో జన్మభూమి పేరు మార్పు 
విజయవాడ -విశాఖపట్నం మధ్య తిరిగే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కి కౌంటర్ ట్రైన్‌గా దీన్ని తీసుకొచ్చారు.  విశాఖపట్నం- విజయవాడ మధ్య ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ని పరిచయం చేశారు. అంటే ఉదయం పూట రత్నాచల్ విజయవాడలో బయలుదేరితే ఇంచుమించు అదే సమయానికి విశాఖపట్నంలో ఆ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరేది. సాయంత్రానికి రత్నాచల్ విజయవాడ వచ్చేస్తే ఇంటర్‌సిటీ వైజాగ్ చేరుకునేది. అయితే తర్వాత ఇంటర్‌ సిటీని తెనాలి వరకూ పొడిగించారు. 
2004 ముందు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాలు జోరుగా సాగేవి. ఆ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఇంటర్సిటీకి " జన్మభూమి" అనే పేరు పెట్టారు. అప్పట్లో సికింద్రాబాద్- తెనాలి మధ్య నాగార్జున ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ (2719/2720) తిరిగేది. ఫీజిబిలిటీని దృష్టిలో పెట్టుకుని 2007 జూన్‌లో ఆ ట్రైన్ రద్దు చేసి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ వరకూ పొడిగించారు. 


గుంటూరు,నల్గొండ మీదుగా సికింద్రాబాద్ వరకూ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12806/12806) దక్షిణ మధ్య రైల్వే నడిపే అతి పొడవైన రైళ్లలో ఒకటి. దీనికి ప్రస్తుతం 24 బోగీలు ఉంటున్నాయి. దీనిలో రిజర్వేషన్ బోగీలు (18), జనరల్ బోగీలు (3),pc (1),DLR (2) ఉంటాయి. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య తిరిగే రైళ్లలో జన్మభూమి అతి ముఖ్యమైనది. మిగిలిన ట్రైన్లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఆంధ్ర తెలంగాణలోని రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య దురంతో, కోణార్క్, గోదావరి, గరీబ్ రథ్, ఈస్ట్ కోస్ట్, వందేభారత్ వంటి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఖర్చుపరంగా, సీట్ల లభ్యత పరంగా " జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌" ప్రయాణికులకు అందుబాటులో ఉండటం వల్ల ఈ ట్రైన్‌కు డిమాండ్ చాలా ఎక్కువ. ఇప్పుడు చర్లపల్లి స్టేషన్ అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి రావడంవల్ల సికింద్రాబాద్ స్టేషన్ రద్దీ తగ్గించేందుకు జన్మభూమిని చర్లపల్లి మీదుగా నడిపేలా కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు అధికారులు.