పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు: కర్నూలు ప్రమాదంపై ప్రత్యక్షసాక్షి
కర్నూలులో ఘోర బస్సు ప్రమాద ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. బస్సు సీట్లో కూర్చున్నవారు కూర్చునట్లే అస్దిపంజరాల్లా మారిపోయారని, జనం చోద్యం చూస్తున్నారంటూ ప్రత్యక్షసాక్షి తెలిపారు.

కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన తెలుగు రాష్ట్రాలను కలచివేస్తోంది. 20మందికి పైగా ప్రయాణికులు బస్సులోనే దగ్దమైన తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో హృదయ విదారక దృశ్యాలపై , ఆ సమయంలో అటుగా వెళుతూ చూసిన ప్రత్యక్షి హైమారెడ్డి ఏమంటున్నారంటే.. బస్సు తగలబడుతున్న సమయంలో ఏం జరిగిందో.. ఆమె మాటల్లోనే..
నేను పుట్టపర్తి వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తున్నాను. మార్గంమధ్యలో కర్నూలుకు సమీపంలో రహదారిపై భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. ఎందుకు ఇంతలా ట్రాఫిక్ ఆగిందని సందేహం వచ్చింది. నా ప్రక్కన కూర్చున్న డ్రైవర్ కు చెప్పడంతో , అక్కడ బస్సు తగలబడిపోతోంది మేడమ్ అన్నాడు. ఏదైనా సహయం చేద్దాం అని వెంటనే కారు దిగి, కాలుతున్న బస్సు వద్దకు వెళ్లాను. అప్పటికే బస్సు ఎగసిపడుతున్న మంటలలో తగలబడిపోతోంది. కొందరు కింద కూర్చుని ఏడుస్తుంటే, మరికొందరు విపరీతంగా టెన్షన్ పడుతున్నారు. ప్రయాణికులు ఎవరైతే ఆ సమయంలో క్రిందకు దూకేశారో , వారి ఫోన్లు బస్సులోనే ఉండిపోవడంతో కాలిపోయాయి.

బస్సు తగలబడుతుంటే.. జనం సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు..
ఓవైపు బస్సు తగలబడుతుంటే సహాయం చేయాల్సిన జనం చోద్యం చూస్తున్నారు. కనీసం సహాయం కోసం ఫోన్లు లేక ప్రయాణికులు బోరున ఏడుస్తుంటే, చుట్టూ ఉన్న జనం మాత్రం తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. అంతమంది ఉన్నా, ఎవరూ కనీసం పోలీసులకు కాల్ చేయలేదు. కంగారులో నా కారులో ఫోన్లు మర్చిపోవడంతో మళ్లీ వెనక్కు వెళ్లి కారులో ఫోన్ తీసుకుని కర్నూల్ ఎస్పీతోటు ఎస్బీ ఇన్సెక్టర్ కు కాల్ చేశాను. వాళ్లు వెంటనే స్పందించారు. రూరల్ సీఐ బృందంతోపాటు ,ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్దలానికి చేరుకున్నారు. అంబులెన్స్ సైతం చేరుకున్నాయి. హరీష్ అనే వ్యక్తి అక్కడ బాధితుల్లో ఆరుగురిని ప్రవేటు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురి అంబులెన్స్ లో ఎక్కించాము. కాసేపట్లో ఎస్పీ, పోలీసు సిబ్బంది ఘటనా స్దలానికి చేరుకున్నారు.

సీట్లలో మాంసపు ముద్దలు చూసి తట్టుకోలేకపోయా..
బస్సు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కూర్చున్నట్లే మాంసపు ముద్దలుగా మారిపోయారు. చాలా దరుణం ఘటన అది. చూస్తే కలచివేసింది. ప్రయాణికులు మాంసపు ముద్దలుగా మారిన పరిస్దితులు చూసి కన్నీళ్లు ఆగలేదు. అస్దిపంజరాలు అలా సీట్లలోనే చూస్తే నా వల్ల కాలేదు. ఎవరైనా కుటుంబ సభ్యులను కోల్పోతే, వారి కష్టం ,కడుపుకోత ఎలా ఉంటుందోనని తట్టుకోలేకపోయాను. సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆగిపోయి ,అక్కడే స్నానం చేయడం జరిగింది. పోలీసులు సమాయానికి రాకపోయి ఉంటే, కనీసం మిగతావారి ప్రాణాలు కూడా కాపాడలేని పరిస్దితి అక్కడ కనిపించింది.
ప్రమాదం జరిగిన సమయంలో విపరీతంగా ట్రాాఫిక్ ఆగిపోయింది. పోలీసులు సైతం ఆలస్యమైతే ఘటనాల స్దలానికి చేరుకోలేని పరిస్దితి ఉండేది. కాసేపటి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మంటలు ఆర్పేందుకు చాలా సమయం పట్టింది. బస్సు క్రింద బైక్ ఉండిపోయింది. బస్సును ఢీ కొన్న బైక్ పై ఉన్న వక్తి రోడ్డు ప్రక్కన పడిపోయాడు. ఇదీ జరిగిందంటూ ఆ సమయంలో హృదయవిధారక దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చెప్పి, భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షసాక్షి హేమ పోస్ట్ చేశారు.





















