India vs England Test Match At Uppal Stadium: హైదరాబాద్‌: ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు 25 వేల మంది స్కూల్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాల‌కు రిప‌బ్లిక్ డే రోజున ఉచితంగా అనుమ‌తించాలని హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది. 


ఈనెల 25 నుంచి ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు మ్యాచ్‌కు పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (Hyderabad Cricket Association) అధ్యక్షడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు వెల్ల‌డించారు. శ‌నివారం ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో జ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ.. హెచ్‌సీఏ కొత్త కార్య‌వ‌ర్గం ఎన్నికైన అనంతరం జరుగుతున్న తొలి క్రికెట్‌ మ్యాచ్ కావ‌డంతో దీనిని పండుగలా నిర్వహించేందుకు ఈసారి కొన్ని విప్ల‌వ‌వాత్మ‌క నిర్ణయాలు తీసుకున్నామ‌ని చెప్పారు. 







స్కూల్‌ స్టూడెంట్స్‌కు స్టేడియంలో ఉచిత ప్రవేశం
టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ ఐదు రోజుల పాటు 25 వేల మంది స్కూల్‌ స్టూడెంట్స్‌కు స్టేడియంలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామ‌ని, అలానే తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాల‌కు రిప‌బ్లిక్ డే రోజున ఉచితంగా అనుమ‌తిస్తున్నామ‌ని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని, అయితే, క‌చ్చితంగా స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి వ‌చ్చిన లెట‌ర్ ఆధారంగా పాస్‌లు కేటాయిస్తాం కానీ, వ్య‌క్తిగ‌తంగా ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకఁండా మధ్యాహ్న భోజనం, తాగునీరు ఉచితంగా అందిసున్నామ‌ని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది వారి విభాగ‌దిప‌తి నుంచి లెట‌ర్ తీసుకుని హెచ్‌సీఏ సీఈఓకి ఈమెయిల్ చేయాల‌ని సూచించారు. 


టిక్కెట్ల‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయాలు
గ‌తంలో జింఖానాలో జ‌రిగిన తొక్కిస‌లాట దృష్ట్యా టిక్కెట్ల‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్ర‌యిస్తున్నామ‌ని చెప్పారు. టెస్టు మ్యాచ్ అయినా స‌రే టికెట్ల కోసం అభిమానుల నుంచి అపూర్వ స్పందన లభించటం సంతోషకరమ‌న్నారు. స్టేడియం నలువైపులా పైకప్పు, నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలు, భారీ ఎల్‌ఈడీ తెరలు, ఆధునాతన ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్ల సొబగులతో మైదానాన్ని టెస్టు మ్యాచ్‌కు ముస్తాబు చేశామ‌న్నారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ ఆఫీస్‌ బేరర్లు ఆర్‌. దేవరాజ్‌, బసవరాజు, శ్రీనివాసరావు, దల్జీత్‌ సింగ్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.