IBOMMA : ఇంటర్నెట్ ఇంత విస్తృతంగా లేని రోజుల్లో ఒక సినిమాకు వెళ్లడమంటే అదో పండగ రోజు. ఇంట్లో వాళ్లు ముందుగానే పిల్లలకు చెప్పే వాళ్లు. ఫలానా రోజు సినిమాకు వెళ్దామంటే ఆ విషయాన్ని ఊరు ఊరు చెప్పుకొని తిరేగే వాళ్లు నాటి కిడ్స్. నేడు అన్నీ అరచేతిలోకి వచ్చేశాయి. రిలీజ్ సినిమా కూడా క్షణాల్లో మీ మొబైల్‌లోకి వచ్చేస్తోంది. ఇది తెలియకుండానే వారిని ఎమోషన్‌లెస్‌గా చేస్తోంది. వారిని పక్కదారి పట్టిస్తోంది. మీకు తెలియకుండానే పిల్లలు మీ అకౌంట్‌ను ఖాళీ చేసేందుకు ఆస్కాం ఇస్తోంది. ఇలా వివిధ రకాలుగా తప్పుడు మార్గాల్లో వెళ్లేందుకు మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుంది.
ఈ “ఐ బొమ్మ” లాంటి పైరసీ వెబ్‌సైట్లు (iBomma, Movierulz, Tamilrockers, Filmywap, 123Movies మొదలైనవి) నిజానికి పిల్లల జీవితాలను నెమ్మదిగా నాశనం చేసే విషపూరిత బాంబులు. ఈ సైట్లు పిల్లల మనస్సును, శరీరాన్ని, భవిష్యత్తును ఎలా ధ్వంసం చేస్తున్నాయో చాలా మందికి అర్థం కావడం లేదు. మాల్వేర్, వైరస్ ద్వారా మీ మొబైల్-ల్యాప్‌టాప్ హ్యాక్ అవుతాయి. మీరు అలవాటు చేసిన వెబ్‌సైట్‌లను మీ పిల్లలు ఓపెన్ చేస్తే అందులే వచ్చే పాప్‌అప్‌లను కూడా ఓకే చేస్తారు. అంతే మీ అకౌంట్ సులభంగా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఈ పైరసీ సైట్లలో 87 శాతం పేజీలు మాల్వేర్‌తో నిండి ఉంటాయని కాస్పర్‌స్కీ ల్యాబ్ 2025 నివేదిక చెబుతోంది. పిల్లలు సినిమా డౌన్‌లోడ్ చేయగానే లేదా స్ట్రీమ్ చేస్తూనే ఆటోమాటిక్‌గా రాన్సమ్‌వేర్, కీలాగర్, స్పైవేర్ డివైస్‌లోకి ప్రవేశిస్తాయి.
ఉదాహరణకు: బిహార్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు iBomma నుంచి “Pushpa-2” డౌన్‌లోడ్ చేశాడు. మూడు రోజుల్లో అతని తండ్రి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అయ్యాయి. హ్యాకర్లు కీలాగర్ ద్వారా OTPలు దొంగిలించారు. ఇలాంటి కేసులు గత రెండేళ్లలో 18,000కుపైగా నమోదయ్యాయి.
మన ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు మనజోలికి ఎందుకు వస్తారులే అనుకుంటారు. కానీ మీరు చేసే ఈ చిన్న తప్పు కారణంగా ఏళ్ల తరబడి మీరు సంపాదించుకున్న డబ్బు, పరువు మొత్తం పోతుంది.
పోర్నోగ్రఫీకి డైరెక్ట్ ఎక్స్‌పోజర్
ఈ సైట్లలో సినిమా పేరుతో పాప్-అప్‌లు వస్తాయి. అడల్ట్ కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ లింకులు ఉంటాయి. పొరపాటున మీ పిల్లలు వాటిని క్లిక్ చేసి చూస్తే ఏమవుతుంది. ఒకసారి అలాంటి వీడియోలు చూడటం ప్రారంభిస్తే వెబ్‌సైట్ ఓపెన్ చేసిన ప్రతిసారీ అవే చూపిస్తారు. 2025 జూలైలో ఇంటర్‌పోల్ ఆపరేషన్ “Blackwrist”లో iBomma సర్వర్ల నుంచి 1.4 మిలియన్ చైల్డ్ అబ్యూస్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు.
సైకాలజీ నిపుణులు దీనిపై గట్టిగానే మాట్లాడుతున్నారు. “9-14 ఏళ్ల మధ్య పిల్లలు ఈ సైట్ల ద్వారా అడల్ట్ కంటెంట్ చూస్తున్నారు. దీనితో బ్రెయిన్‌లో డోపమైన్ రివార్డ్ సిస్టమ్ ముందుగానే డ్యామేజ్ అవుతుంది. 16 ఏళ్లకల్లా పోర్న్ అడిక్షన్, ఇంపాటెన్స్, డిప్రెషన్, సూసైడల్ ఆలోచనలు వస్తున్నాయి.” అని హెచ్చరిస్తున్నారు.
కరోనా తర్వాత పోర్న్ అడిక్షన్ కారణంగా ఈ వేల మంది మైనర్‌లు, వారి తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తున్నారు. వీరిలో మొదటి ఫోర్న్ వీడియో iBomma లాంటి పైరసీ సైట్స్ నుంచే వచ్చిందని చెబుతున్నారు. ఈ విషయం చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదు. సినిమాకు వెళ్తే వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఇంట్లో ఇలాంటి పైరసీ వెబ్‌సైట్‌లలో సినిమాలు చూపిస్తున్నారు.
కొన్నిసార్లు కొందరు పిల్లలు ఈ లింక్‌ల ద్వారా వచ్చిన చాట్‌లను ఓపెన్ చేస్తున్నారు. అవతలి గుర్తు తెలియని వ్యక్తితో చాట్ చేస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరం. ఇలా పరిచయాలు పెంచుకొంటున్న సైబర్ గ్యాంగులు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వారి వీడియోలు రికార్డు చేసి వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
భావి క్రిమినల్స్‌ను తయారు చేస్తున్న డార్క్‌వెబ్ సైట్స్
పైరసీ సైట్లలోని చాట్ రూములు, టెలిగ్రాం లింకుల ద్వారా పిల్లలను డార్క్‌వెబ్‌లోకి ఆకర్షిస్తారు. అక్కడ మొదట “ఉచిత నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఇస్తాం” అని, తర్వాత డ్రగ్ కొరియర్‌గా, మనీ మ్యూల్‌గా మారుస్తారు. ఇప్పుడు మనకు ఐ బొమ్మ రవి మాత్రమే కనిపిస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తపడకుంటే మాత్రం కచ్చితంగా ఇలాంటి వారు గల్లీకొకరు పుట్టుకొస్తారు. ఈజీ మనీకి అలవాటు పడిన వారంతా ఈ డార్క్‌వెబ్సైట్‌లపై ఆధారపడితే దేశానికే ప్రమాదం.
చదువు, ఆరోగ్యం పతనం
పైరసీ సైట్లలో గంటల తరబడి గడపడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుంది. పైరసీవెబ్‌సైట్‌లలో రోజుకు చాలా సినిమాలు అప్‌లోడ్ చేస్తుంటారు. ఏ రోజు ఓ కొత్త సినిమా వచ్చినా చూడాలనిపిస్తుంది. అంతేకాకుండా అందులో వచ్చే ఇతర వీడియోలకు ఆకర్షితులైతే నిత్యం వాటిపైనే ఉంటారు. దీని వల్ల ఆరోగ్య సమస్యు వస్తాయి. బ్లూలైట్ వల్ల మెలటోనిన్ హార్మోన్ తగ్గుతుంది. 12-15 ఏళ్లలోనే ఇన్సామ్నియా, డిప్రెషన్, ఊబకాయం వస్తున్నాయి.
చట్టపరమైన పరిణామాలతో భవిష్యత్ నాశనం
భారతదేశంలో సెక్షన్ 63, 63A కాపీరైట్ చట్టం, IT యాక్ట్ సెక్షన్ 66, 67, 67A ప్రకారం పైరసీ కంటెంట్ డౌన్‌లోడ్/షేర్ చేస్తే జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. మైనర్ అయినా కేసు నమోదవుతుంది. ఇది పాస్‌పోర్ట్, ఉద్యోగం, వీసా రిజెక్షన్‌కు దారి తీస్తుంది.
చట్టవ్యతిరేక కార్యక్రమాలు
మీ పిల్లలను మీరే దగ్గర ఉండి ఐ బొమ్మ లాంటి పైరసీ వెబ్‌సైట్‌లలో సినిమాలు చూపిస్తుంటే తప్పును మీరే ప్రోత్సహిస్తున్నట్టు అర్థం. ఇవాళ పైరసీ తప్పు కాదన్న మీరే రేపు ఆ పిల్లలు ఫేక్ కరెన్సీ తీసుకొచ్చినా తప్పని గట్టిగా చెప్పలేరు. ఇంకా ఏదైనా తప్పు చేసినా అడగలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. అందుకే పైరసీ సైట్‌లలో సినిమాలు చూపించి మీ పిల్లల భవిష్యత్‌ను మీరే నాశనం చేసుకోకండి.