హైదరాబాద్ మసాజ్ సెంటర్లలో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫిట్‌నెస్‌ ట్రైనర్ గా ఉద్యోగంలోకి తీసుకొన్న మహిళను అసాంఘిక కార్యకలాపాలు చేయాలంటూ మసాజ్ సెంటర్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండ్లగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్టలోని ఓ మసాజ్ సెంటర్ లో ఫిట్‌నెస్‌ ట్రైనర్ గా చేరింది. అక్కడికి వచ్చే వారికి మసాజ్, శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయించటమే ఆమె బాధ్యత. ఉద్యోగంలోకి తీసుకున్న సమయంలో ఆమె అందుకు అంగీకరించారు. నెలకు లక్ష రూపాయల జీతం ఇస్తామనడంతో మహిళ ఉద్యోగంలో చేరారు. విధుల్లోకి చేరిన కొన్ని రోజుల తర్వాత మసాజ్ సెంటర్ కు వచ్చే పురుషుల చెప్పినట్లు నడుచుకోవాలంటూ ఒత్తిడి చేశారు. ఆమె అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. పురుషులు చెప్పినట్లు వినాలని, ముద్దులు ఇవ్వాలని నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపులు తట్టుకోలేని బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 


ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు
గత నెలలో మసాజ్‌ కేంద్రాలు, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రాలపై బంజారాహిల్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ 12 మంది యువతులను రెస్క్యూ చేసి పునరావాస కేంద్రానికి తరలించారు. నలుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని హెవెన్‌ ఫ్యామిలీ స్పా, ది వెల్‌వెట్‌ స్పా కేంద్రాల్లో కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్ పేరుతో ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిర్వాహకుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అరెస్ట్ చేశారు.


అనుమతులు లేకుండా నిర్వహణ
అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. దాదాపు 10 మసాజ్‌ పార్లర్ల మీద దాడులు చేసి  34 మంది నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్న సెంటర్లను సీజ్ చేశారు. జీహెచ్‌ఎంసీ లైసెన్స్‌లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్‌లు, ప్రొఫెషనల్‌ థెరపిస్ట్‌లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్‌ సైతం లేవని తేలింది. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్‌ మసాజ్‌ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


పైకి మసాజ్ సెంటర్
పైకి మాత్రం మసాజ్ సెంటర్. లోపల జరిగే తంతు వేరుగా ఉంటుంది. రోజు రోజుకు కొత్తకొత్తగా అమ్మాయిలు రావడం స్థానికులకు అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే మసాజ్ పేరుతో వ్యభిచారం జరుగుతుందని గుర్తించారు. దీంతో పోలీసులు ఆ మసాజ్ సెంటర్‌పై దాడి చేయగా ఐదుగురు యువతులు, ఒక విటుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఐదుగురు యువతులను, ఒక విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.