Hyderabad Crime News: హైదరాబాద్ లోని అల్వాల్ పరిధిలో ఓ వివాహితపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను అల్వాల్ పోలీసులు వెల్లడించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఏర్పాటు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.


వారు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత వివాహితురాలైన మహిళ యాప్రాల్ లో నివసిస్తుంది. గత శుక్రవారం సాయంత్రం యాప్రాల్ లో ఓ మహిళ ఉబర్ ఆటో (వాహనం నంబరు ఏపీ 11టీఏ 0266) బుక్ చేసింది. ఆ ఆటో రాగానే ఎక్కి ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ పని ముగించుకొని, మళ్లీ అదే ఆటోలో ఇంటికి తిరుగు ముఖం పట్టింది. అప్పటికే ఆమెపై కన్నేసిన ఆటో డ్రైవర్, ఆమెను మాటల్లో పెట్టి, వీధుల గుండా తిప్పుతూ ఓ మద్యం షాపు వద్ద ఆటోను ఆపాడు.


మహిళ అభ్యంతరం చెబుతున్నా వినకుండా ఆటో డ్రైవర్ ఆ వైన్ షాపు వద్ద మరో ఇద్దరు వ్యక్తులను ఆటో ఎక్కించుకున్నాడు. ఆ ఇద్దరు, మద్యం తాగుతూ మహిళ వద్దువద్దంటున్నా ఆమెతోనూ బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం వారిలో రంగపాక సాయికిరణ్ అనే వ్యక్తి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు. అత్యాచారం అనంతరం తెల్లవారుజామున వివాహితను అల్వాల్ లోని గణేష్ టెంపుల్ వద్ద ఒంటరిగా వదిలేశారు. ఆమెను భయభ్రాంతులకు గురిచేసి ఒంటరిగా వదిలేయడంతో బాధితురాలు 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బొల్లారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాహిత తెలిపిన వివరాల ప్రకారం నిందితులను గుర్తించినట్లు తెలిపారు. 


ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. సైబరాబాద్ పోలీస్ సేవల కోసం డయల్ 100 చేసి పోలీసుల సేవలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా తెలిపారు.