Hyderabad Lorry Driver: హైదరాబాద్ లో ఓ లారీ డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంతో వాహనం నడిపిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ లారీ డ్రైవర్ ఏకంగా బైక్ ను 2.5 కిలో మేర ఈడ్చుకొని వెళ్లాడు. ఈ సమయంలో నిప్పులు కూడా చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో బైక్.. లారీ కింద చిక్కుకోగా, వాహనదారుడు బ్యానెట్‌పైనే నిలబడి ఆర్థనాదాలు చేసినా ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. ఆపకుండా లారీని వేగంగా డ్రైవ్ చేశాడు. వెనకే ఉన్న ఓ కారు డ్రైవర్ ఇందంతా వీడియో తీయడంతో విషయం వెలుగుచూసింది. వీడియో ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్‌ని పట్టుకున్నారు.
చంపా పేట ప్రధాన రోడ్డుపై ఈ లారీ ఘటన జరిగింది. స్థానిక ఈదీ బజార్ కు చెందిన వ్యాపారి మహ్మద్ అబ్దుల్ మజీద్ (60) అర్ధరాత్రి తన హోండా ట్విస్టర్ టూ వీలర్ పై చంపాపేట్ లక్ష్మీ గార్డెన్ దగ్గర వెళుతుండగా వెనుకవైపు నుంచి ఒక లారీ (AP 39VC 976) వచ్చింది. అకస్మాత్తుగా, నిర్లక్ష్యంగా అతని బైక్‌ను ఢీకొట్టడంతో అతను రహదారికి ఎడమ వైపున పడిపోయాడు. అతనికి ఎటువంటి గాయాలు కాలేదు కాని అతని ద్విచక్ర వాహనాన్ని లారీ కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. బైకర్ ఎలాగొలా ఆ లారీ బానెట్ ఎక్కి లారీని ఆపాల్సిందిగా డ్రైవర్ ను కోరాడు. అయినప్పటికీ అతను కనికరించకుండా లారీని మరింత స్పీడ్ గా ముందుకు పోనిచ్చాడు.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది. చంపాపేట్ టి-జంక్షన్ వద్ద అదే లారీ (టిఎస్ 07యుఎన్ 2580) గల మరో కారును కూడా ఢీకొట్టి ధ్వంసం చేసి లారీ ఆగకుండా వెళ్లి పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ని సీజ్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేశామనిపోలీసులు తెలిపారు