Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై ఇంజినీరింగ్ టీమ్ చేసిన చిన్న తప్పిదం ఓ వాహనదారుడికి ఏకంగా రూ.40 లక్షల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. పరిస్థితి మరింత దిగజారితే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం నుంచి కారు ప్రయాణికులు బయటపడ్డారు. దీనిపై ఆ బాధితుడు ట్విట్టర్ వేదికగా కొన్ని సలహాలు ఇస్తూనే, జరిగిన ఘటన వివరాలు పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ కు సంబంధించి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
బాధితుడు వెల్లడించిన వివరాలిలా..
నగరంలోని మాదాపూర్ కు చెందిన ఉదయ్ తేజ అనే ఆడిటర్ గత వారం గర్భవతి అయిన తన భార్య, డ్రైవర్‌తో కలిసి బీఎండబ్ల్యూలో ప్రయాణిస్తున్నారు. కోకాపేట సమీపంలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న కారు వర్షపు నీటిలో చిక్కుకుపోయింది. గర్భవతి అయిన భార్యతో అర్ధరాత్రి సమయంలో మరో వాహనం కోసం వర్షపు నీటిలో ఎదురుచూశామని భయానక అనుభవాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. తనతో పాటు మరికొన్ని లగ్జరీ కార్లు ఓఆర్ఆర్ వద్ద వర్షపు నీటిలో చిక్కుకుపోయాయని పేర్కొన్నాడు.
గ్రేట్ ఇంజినీరింగ్ వర్క్..
అక్కడ వర్షపు నీరు నిలిచిపోవడానికి కారణాలు తెలుపుతూ ఉదయ్ తేజ ఇంజినీరింగ్ టీమ్ పై సెటైర్లు వేశారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వేసిన ఇంజినీరింగ్ టీమ్ వర్షపు నీరు వెళ్లడానికి హోల్స్ పెట్టడం మరిచిపోయిందని తెలిపారు. గ్రేట్ ఇంజినీరింగ్ టీమ్ చేసిన తప్పిదం కారణంగా వర్షపు నీళ్లు అక్కడ నిలిచిపోతున్నాయని చెప్పారు. 12 బీఎండబ్ల్యూ కార్లు, 8 మెర్సిడెజ్ కార్లు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయని, ఇది వాహనదారులకు కోట్ల రూపాయల నష్టాన్ని చేకూర్చిందని చెప్పారు. 2016లో తెలంగాణ ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్‌డీపీ) ను తీసుకొచ్చింది. SNDP అంటే ఇదేనా. నాలాలు నిర్మించడం మంచి పని. కానీ ఒక అడుగు ఎత్తు గోడ నిర్మిస్తే నాలాలోకి వర్షపు నీళ్లు ఎలా వెళతాయని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఏదైనా పరిష్కారం చూడాలని కోరారు.
తన ఫ్రెండ్ కు కాల్ చేయగా, 10 నిమిషాల్లో వచ్చి పికప్ చేసుకున్నాడు. రాత్రి ఫ్రెండ్ ఇంట్లో తన భార్యను డ్రాప్ చేసి.. తరువాత తన డ్రైవర్ తో కలిసి కారు కోసం మళ్లీ ఓఆర్ఆర్ కు వచ్చినట్లు వెల్లడించారు. నీళ్లు ఎప్పుడు తగ్గుతాయా అని రాత్రి నుంచి ఉదయం వరకు ఎదురుచూశానని తెలిపారు. కారును రిపేర్ చేయడానికి ఇవ్వగా.. రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసరికి షాకయ్యారు. కారు ఇంజిన్ పూర్తిగా డ్యామేజీ అయిందని, కొత్త ఇంజిన్ మార్చాలని సూచించారని, పైగా కారు రిపేర్ పూర్తయ్యే వరకు 2 నెలలు టైమ్ పడుతుందని బాధితుడు ఉదయ్ తేజ ట్వీట్లలో రాసుకొచ్చారు. ఈ విషయంపై నగరవాసులు సీరియస్ గా స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని మీలాంటి వారు ప్రశ్నిస్తే పరిస్థితులో మార్పు వస్తుందని కొందరు స్పందించారు. మరికొందరైతే దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, వారి వద్ద నుంచి మీరు నష్టపోయిన నగదు వసూలు చేయాలని ఉదయ్ కి సూచించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial