Hyderabad CP Warning to pubs: న్యూఇయర్ వేడుకలంటే.. మందేయడం.. చిందేయడం. అంత వరకు ఆగితే పర్వాలేదు. మత్తులో రోడ్లపై తూగాలనుకుంటే మాత్రం ఊరుకోమని హెచ్చిరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వేడుకలు చేసుకోవడంలో తప్పులేదన్న ఆయన... గీత దాటితే మాత్రం తాటతీస్తామని చెప్పకనే చెప్పారు. ఎవరైనా పరిధులు దాటితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రూల్స్ మీరకుండా ప్రోగ్రాములు ప్లాన్..
ముఖ్యంగా పబ్స్, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజర్లు.. రూల్స్ మీరకుండా ప్రోగ్రాములు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఏయే పరిమితుల్లో ఉండాలనేది ఇప్పటికే నోటీసులు ఇచ్చామని... దాన్ని పక్కాగా ఫాలో కావాలని చెప్పారు. ఎంత సమయం వరకు ఈవెంట్స్ జరుపుకోచ్చు.. మ్యూజిక్ సిస్టమ్‌లో సౌండ్ ఎంత మేర ఉండాలి అనేది స్పష్టంగా చెప్పామని.. దాన్ని దాటొద్దని చెప్పారు. కాలనీల్లో పక్కవారికి ఇబ్బందిలేకండా ఉండాలని... ఏవి అనుమతిస్తారు... ఏవి అనుమతించరు అనేది చూసుకోవాలన్నారు. మద్యం ఎవరికి సరఫరా చేయాలో... ఎవరికి ఇవ్వకూడదు అనేది పబ్స్, రెస్టారెంట్లు పాటించాలన్నారు. మైనర్లు వస్తే వారికి ఎట్టి పరిస్థితుల్లో మద్యం సరఫరా చేయడానికి వీల్లేదన్నారు సీపీ శ్రీనివాస్‌రెడ్డి.
ఇక... డ్రగ్స్ లాంటి మత్తుపదార్థాలకు తావు ఉండకూడదని గట్టిగా హెచ్చరించారు. డ్రగ్స్ సప్లయి చేస్తున్నట్టు తెలిస్తే... పెద్ద నేరంలో భాగస్వాములు అయినట్టే అని అన్నారు. ఆ నేరంలో ఒక్కసారి ఇరుక్కుంటే... బయటకురావడం కుదరదని చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని... పబ్బులు, రెస్టారెంట్లు కూడా మూసేసుకునే పరిస్థితులు వస్తాయన్నారు. దయచేసి వీటికి ఆస్కారం ఇవ్వకుండా అందరూ పరిమితుల్లో ఉండి... న్యూఇయర్‌ను ఆహ్వానిస్తే సంతోషంగా ఉంటుందని చెప్పారు.
మందు తాగని ఫ్రెండ్స్ ను వెంట తీసుకెళ్లండి..
మరోవైపు... రోడ్ల మీద తిరిగే యువతి, యువకులకు కూడా ఆయన హెచ్చరించారు. బైకులు, కార్లలో వెళ్లేవారు తాగి వాహనాలు నడపొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాహనం నడిపేందుకు డ్రింక్ చేయని స్నేహితులను ఎవరినైనా వెంట తెచ్చుకోవాలని సూచించారు. తాగని వారు.. మాత్రమే రిటర్న్ వెళ్లేటప్పుడు డ్రైవింగ్ చేయాలన్నారు. రూల్స్ పాటించకుండా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే మీకే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి. రెస్టారెంట్లు, పబ్బుల వాళ్లు కూడా... ఇది గమనించుకోవాలన్నారు. గ్రూప్‌గా వచ్చిన తాగిన వాళ్లు... ఎలా వెళ్తున్నారు అనేది చూసుకోవాలన్నారు. ఆ గ్రూప్‌లో తాగని వారు ఉంటే... వారే వాహనం డ్రైవ్ చేసేలా చూడలన్నారు. లేదంటే... డ్రైవింగ్ కోసం ఒకరిని ఏర్పాటు చేయాలని పబ్‌లు, రెస్టారెంట్ నిర్వాహకులకు సూచించారు.
డ్రగ్స్ మీద రాబోయే రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ
న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ సప్లయ్ చేస్తే మాత్రం... మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి. అంతేకాదు.. డ్రగ్స్ మీద రాబోయే రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని... అందులో భాగంగా పాత కేసులు కూడా రివ్యూ చేస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ సప్లయర్స్ చైన్ మొత్తాన్ని గుర్తించి.. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ లేకుండా చేసే విధంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామన్నారు. అందుకు ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు.
న్యూ ఇయర్ 2024ను అందరూ సంతోషంగా అహ్లాదంగా ఆహ్వానించాలని సూచించారు. యువతీ యువకులు, చదువకునే వాళ్లకు.. ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని... అలా చేస్తే.. భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. క్షణికావేశంలో చేసే తప్పులకు... భవిష్యత్ మొత్తం బాధపడాల్సి వస్తుందన్నారు. కనుక... జాగ్రత్తగా.. నిబంధనలకు లోబడి వేడుకలు చేసుకుంటే ఎవరికీ ఇబ్బందులు ఉండవని చెప్పారు. అందుకే.. పరిమితులకు లోబడి వేడుకలు జరుపుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.