Hyderabad Crime News: ఒక్క ఓటర్ ఐడీ ఉంటే చాలు పాస్‌పోర్ట్ వరకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి గుర్తింపు కార్డును కూడా పొందొచ్చు. ఇదే లూప్‌ను పట్టుకున్న ఓ కేటుగాడు వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లు తయారీ సెంటర్‌ను రూపొందించాడు. ఇందులో ప్రభుత్వాఫీసుల్లో పని చేస్తున్న వారిని కూడా భాగస్వాములను చేశాడు. బర్త్ సర్టిఫికేట్ నుంచి విదేశాలకు వెళ్లే పాస్‌పోర్టు వరకు అన్నింటిని హైదరాబాద్‌లోని ఓ గల్లీల్లో అమ్మేస్తున్నాడు.
విషయంపై తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఆ కేటుగాడిని. హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళీ పోలీసులు కంబైన్డ్ ఆపరేషన్‌లో నకిలీ సర్టిఫికేట్ ముఠా గుట్టు రట్టు అయింది. వీరిలో ఎలగం రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. అతనికి పల్లవి, విజయలక్ష్మి, మహబూబ్, గిరిరాజ్ అనిల్ కుమార్ బండి శంకర్ సహకరించారు. వీళ్లను అరెస్టు చేసిన పోలీసులు 3 కంప్యూటర్లు, ఒక ల్యాప్ టాప్, 2 ప్రింటర్లు, బయో మెట్రిక్ మిషన్, కస్టమర్స్ డేటా ఎంట్రీ బుక్ స్వాధీనం చేసుకున్నారు. లక్షా 50 వేల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నాడు.
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లో ఆర్ఎస్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఎలగం రాజ్ కుమార్ షార్ట్ కట్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఈ దందా మొదలు పెట్టాడు. ముందు మ్యాజికల్ యూనివర్సల్ ఐడీ పోర్టల్ టూల్ అనే యాప్ ద్వారా ఓటర్ ఐడీ రెడీ చేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని వారికి కావాల్సిన సర్టిఫికేట్లు తయారు చేసి ఇస్తాడు. రాజ్‌కుమార్ తయారు చేసిన నకిలీ ఆధార్, ఇతర ప్రభుత్వం కార్డులను మహబూబ్ అప్రూవల్ చేయిస్తాడు. అతను సర్వశిక్షా అభియాన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ముందు ఓటర్ ఐడీ కార్డు దాని ఆధారంగా ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, అనంతరం పాస్‌పోర్టుకు అప్లై చేస్తాడు.
పాస్‌పోర్టు అప్రూవ్ అయ్యేందుకు బండి శంకర్, గిరిరాజ్ అనిల్ కుమార్ సహకరిస్తారు. బండి శంకర్ పాస్‌పోర్ట్ ఏజెంట్‌గా ఉంటే.. అనిల్ జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. వీటికి గెజిటెడ్ సంతకాలు కావల్సినప్పుడు విజయలక్ష్మి, పల్లవి సంతకాలు చేసేవాళ్లు. వీళ్లంతా ముఠాలుగా ఏర్పడి ఎవరికి ఏం కావాలన్నా తయారు చేసి ఇచ్చే వాళ్లు. నకిలీ పాస్‌పోర్టులు ఎక్కువ నేపాలీ వాళ్లకు అమ్ముకున్నట్టు చెబుతున్నారు. రాజ్ కుమార్ గతంలోనే ఈ నకిలీ సర్టిఫికేట్ కేసులో అరెస్టు అయ్యాడు. అయితే అప్పట్లో తెలివిగా తప్పించుకొని జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చినా తన బుద్ది మానుకోలేదు.
ఈ ముఠా ఇప్పటి వరకు 15 వేల ఓటర్ ఐడీ కార్డలు, 10 వేల ఆధార్ కార్డులు, 50 పాస్ పోర్ట్‌లు, 1500 పాన్ కార్డులు, వందల సంఖ్యలో బర్త్ సర్టిఫికెట్లు ఫేక్‌గా తయారు చేసి అమ్మేశారు. వారి వద్ద ఉన్న డేటా ఆధారంగా వాటిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ముఠాను కోర్టులో హాజరుపరిచారు.
Also Read: సైబర్ నేరాల్లో హడలెత్తిస్తున్న డిజిటల్ అరెస్టులు, ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి?