(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad: శరీరాన్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో, బకెట్‌లో - మహిళ తల గుర్తింపు కేసులో వణికిపోయే వాస్తవాలు
అనురాధ తలను మూసీ నదిలో పడేయగా మిగతా శరీరాన్ని కూరగాయలు కోసినట్లుగా ముక్కలుగా నరికి, శరీర భాగాల ముక్కలను కవర్లో చుట్టి ఇంట్లోని ఫ్రిజ్ లో నిందితుడు దాచాడు.
హైదరాబాద్ నగరంలో ఓ హత్య జరిగిన తీరు తీవ్రమైన విస్మయం కలిగిస్తోంది. వారం రోజుల క్రితం ఈ హత్య జరగ్గా తాజాగా విస్తుగొలిపే వాస్తవాలు బయటికి వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ తల భాగం మూసీ నదీ ప్రాంతంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో కూపీ లాగగా తాజా విషయాలు తెలిశాయి. హత్యకు గురైన మహిళను ఎర్రం అనురాధ అనే 55 ఏళ్ల మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమె ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్‌లో మొండెం లేని తల దొరికిన వెంటనే మలక్ పేట పోలీసులు అప్రమత్తమై 8 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. తాజాగా నిందితుడు అనురాధ శరీర భాగాలను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో దాచిన విషయం వెలుగులోకి వచ్చింది.
కేసు వివరాలను ఆగ్నేయమండల డీసీపీ రూపేశ్ కుమార్ మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, ప్రతి 3 టీంలకు ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఏసీపీలు దర్యాప్తులో పాల్గొని కేసు మిస్టరీని ఛేదించారు. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 750 పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులపై దృష్టి పెట్టాం. కానీ, ఎక్కడా ఎలాంటి కేసు నమోదు కాలేదు. మొండంలేని తల దొరికినప్పటికి వారం రోజుల ముందు నుంచి కొన్ని వందల గంటల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. ఈ క్రమంలో తల దొరికిన ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఓ వ్యక్తి కనిపించాడు.
ఆ వ్యక్తిని చంద్రమౌళి అని గుర్తించాం. అతని అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్లి దర్యాప్తు చేయగా, ఇంట్లో మహిళ చేతులు, కాళ్లు, ఇతర అవయవాలు దొరికాయి. చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించాడు. వాసన రాకుండా మృతురాలి శరీర భాగాలపై హంతకుడు కెమికల్స్, స్ప్రేలు వాడాడు. వాటన్నింటిని ఈ రోజు సీజ్ చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించాం’’ అని పోలీసులు తెలిపారు.
అనురాధ తలను మూసీ నదిలో పడేయగా మిగతా శరీరాన్ని కూరగాయలు కోసినట్లుగా ముక్కలుగా నరికి, శరీర భాగాల ముక్కలను కవర్లో చుట్టి ఇంట్లోని ఫ్రిజ్ లో నిందితుడు దాచాడు. ప్లాస్టిక్ కవర్లలో దాచిన శరీరం భాగాల ముక్కలను సిటీలోని కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పడేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఆ పరిచయం వల్ల 7 లక్షల అప్పు
పదేళ్ల క్రితం హంతకుడి తండ్రికి ఆమె పనిచేసే ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వల్లనే చైతన్యపురిలోని నిందితుడి ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక పోర్షన్‌ను నర్సుకు అద్దెకు ఇచ్చాడు. ఆమె దాదాపు రెండేళ్లుగా అక్కడే నివసిస్తుండగా, ఆమె నుంచి చంద్రమౌళి దాదాపు రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
బకెట్‌లో, ఫ్రిజ్‌లో శరీర భాగాలు
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో చంద్రమౌళి నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఈక్రమంలో, తరచూ ఆమె డబ్బులివ్వాలని పట్టుబట్టడంతో అనురాధను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. మే 12న మధ్యాహ్నం ఆమెతో గొడవపడి చంపేశాడు. తర్వాత శరీర భాగాలను కత్తి, టైల్స్ కట్టర్‌తో ముక్కలు చేశాడు. శరీరం నుంచి తలను వేరు చేసి ఆటోలో తీసుకొచ్చి మలక్ పేట మూసీ పరివాహక ప్రాంతంలో పడేశాడు. మిగిలిన భాగాలను బకెట్‌లో, కాళ్లను ఫ్రిజ్‌లో దాచాడు’’ అని పోలీసులు తెలిపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. అప్పు ఇచ్చినందుకు అనురాధను చంపేయడంతో పాటు అమానవీయ రీతిలో ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచటం అనేది హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.