Hyderabad News: హైదరాబాద్ అంటే చార్మినార్, ధమ్ బిర్యానీ ఎలా గుర్తుకు వస్తుందో.. విపరీతమైన ట్రాఫిక్ కూడా అంతే గుర్తుకు వస్తుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి గంటలకొద్దీ సమయం పడుతుంది. ఏవైనా రోడ్ల మరమ్మతులు జరిగిన సమయంలో, వర్షాలు పడ్డ వేళ హైదరాబాద్ రోడ్లపై ప్రయాణం నకరప్రాయంగా ఉంటుంది. గంటల పాటు వేచి చూసినా కొంత దూరంగా కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన కూడళ్లలో కూడా ట్రాఫిక్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. వీటితో పాటు రాజకీయల ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు జరిగిన సమయంలో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ముందుకు, వెనక్కు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో సగటు వేగం మరీ దారుణంగా ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి.


చుక్కలు చూపించే హైదరాబాద్ ట్రాఫిక్ లో ఏదైనా భారీ వాహనం వెళ్లిందంటే దాని వెనక ఉన్న వారి పరిస్థితి వర్ణనాతీతం. అవేమో నత్తనడకన సాగుతుంటాయి. దారి ఇవ్వకుండా రోడ్డు మధ్యలో నుండి వెళ్తుంటాయి. ఈ ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు సిటీలోకి పలు వాహనాలను ప్రవేశాన్ని రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.


నెమ్మదిగా కదిలే వాహనాలకు నో ఎంట్రీ


నెమ్మదిగా కదిలే వాహనాలు ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్నాయని, ఈ వాహనాలతో సాధారణ ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాయని ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆ వాహనాలపై నిషేధం విధించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భారీ వాహనాలు, వ్యాన్ లు, నేషనల్ పర్మిట్ లారీలు, లోకల్ లారీలు, ప్రైవేట్ బస్సులపై సీపీ ఆంక్షలు విధించారు. 


ఆ సమయంలోనే రావాలి, పోవాలి


నిర్మాణ సామగ్రి, ఇతర అవసరాలకు ఉపయోగించే వాహనాలకు ఒక సమయం కేటాయించారు. భారీ వాహనాలు, లారీలు, వ్యాన్ లు  ఉదయం 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సిటీలోకి రావడానికి వీల్లేదు. సిటీలోకి రావాలంటే రాత్రి 12 గంటల తర్వాతే సిటీలోకి రావాలి. భారీ వాహనాలు, అధిక బరువుతో వెళ్లే వాహనాలు సిటీలో ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆదేశించారు సీపీ సీవీ ఆనంద్. సామగ్రిని మోసుకెళ్లే లోకల్ వాహనాలకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ బస్సులు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సిటీలోకి రావడానికి వీల్లేదు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీవీ ఆనంద్. 


హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, కనెక్టింగ్ రోడ్లు నిర్మిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా హైదరాబాద్ ను మార్చాలని ప్రభుత్వం ఎస్ఆర్డీపీ కింద రోడ్లు నిర్మిస్తోంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లు తీసేసి యూటర్న్ లు పెట్టింది. అయితే ఇవి కొన్ని చోట్ల మంచి ఫలితాన్ని ఇస్తుండగా, కొన్ని చోట్ల వాహనదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ యూటర్న్ ల వద్ద భారీ వాహనాలు టర్న్ తీసుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. తాజాగా సీపీ తీసుకున్న నిర్ణయంతో ఈ ఇబ్బంది కొంత వరకు తగ్గే అవకాశం ఉందని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.