KTR on Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. ప్రతి ఏటా వర్షాలకు హైదరాబాద్‌ నగరంలో వరద సమస్య ఏర్పడుతున్నందున ఆ సమస్య పరిష్కారం కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రూ.10 వేల కోట్లను కేంద్రం నుంచి తేవాలని కోరారు. ఆ నిధులు తెస్తే పౌర సన్మానం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి బీజేపీ నేతలు కూడా పోటీ పడాలని సూచించారు. ఎల్బీ నగర్‌ కూడలిలో ఇన్నర్ రింగ్ రోడ్డుగా పిలిచే ప్రధాన రహదారిపై జీహెచ్‌ఎంసీ నిర్మించిన అండర్‌పాస్‌, బైరామల్‌ గూడలో ఫ్లై ఓవర్‌లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.40 కోట్ల ఖర్చుతో ఎల్బీ నగర్‌ అండర్‌ పాస్‌, రూ.29 కోట్లతో బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌లను నిర్మించారు. నాగోల్‌, బండ్లగూడలో నాలాల అభివృద్ధి పనులకు శంకుస్థాప చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.


వరద ముంపు నివారణకు రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేస్తామని తెలిపారు. ఎల్బీ నగర్‌లో స్థలాల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొత్త పెన్షన్లు 2 నుంచి 3 నెల‌ల్లో అంద‌జేస్తామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.


గతంలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఎల్బీ న‌గ‌ర్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు. రూ. 2,500 కోట్లతో ఎల్బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. అందులో భాగంగానే వ‌ర‌ద ముంపు నివార‌ణ‌కు రూ.వెయ్యి కోట్లతో నాలాల అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని వివరించారు. ఎల్బీ న‌గ‌ర్ ప‌రిధిలో మంచి నీటి స‌మ‌స్యను ప‌రిష్కరించేందుకు 12 రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించామ‌ని తెలిపారు. 353 కిలో మీట‌ర్ల మేర వాట‌ర్ పైపులైన్‌లు వేశామ‌ని తెలిపారు.


ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌ల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌హ‌ముద్ అలీతో పాటు ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.