Hyderabad Indore Expressway: దేశవ్యాప్తంగా మౌలిక వసతులు మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-ఇండోర్ మధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ఐదేల్ల క్రితం శంకుస్థాపన చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇది పూర్తి అయితే మధ్య, దక్షిణ భారత్ మధ్య ఓ విప్లవాత్మక మార్పు తీసుకురానుంది. ప్రయాణ సమయాన్ని తగ్గించి ఆర్థికంగా కూడా ప్రయోజనం కలగనుంది. 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను, తెలంగాణలోని హైదరాబాద్‌ను కలుపుతూ నాలుగు లేన్ల సెమీ-యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే వేస్తున్నారు. దీని పొడవు సుమారు 713 కిలోమీటర్లు. ఈ రోడ్డుపై దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఇది పూర్తి అయితే తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. నాందేడ్, అకోలా బుర్హాన్‌పూర్ వంటి కీలక నగరాలు పట్టణాల మీదుగా  వెళుతుంది. 

అనేక ప్రాంతాల కనెక్టివిటీని మెరుగుపరిచే వ్యూహాత్మక ప్రణాళిక హైదరాబాద్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్‌వే తెలంగాణలోని హైదరాబాద్, యెల్లారెడ్డి, బోధన్‌; మహారాష్ట్రలోని బిలోలి, నాందేడ్, కలాంనూరి, హింగోలి, వాషిమ్, అకోలా; మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్, బార్వాహా, ఇండోర్ మీదుగా వెళ్తోంది. దీన్ని 21 డిసెంబర్ 2020న శంకుస్థాపనతో చేశారు. నవంబర్ 2024 నాటికి దాదాపు 70% నిర్మాణం పూర్తైంది. దీన్ని మరింత వేగవంతం చేసి 2025 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.  

ఎక్స్‌ప్రెస్‌వేతో కలిగే ప్రయోజనాలు  

తగ్గిన ప్రయాణ సమయం: హైదరాబాద్, ఇండోర్ మధ్య సాధారణంగా ప్రయాణ సమయం 18 గంటలు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో అది సుమారు 10 గంటలకు తగ్గుతుందని ఓ అంచనా.  

తగ్గనున్న దూరం: ఎక్స్‌ప్రెస్‌వే కారణంగా ఈ రెండు ప్రాంతల మధ్య దూరం సుమారు 150 కిలోమీటర్లు తగ్గనుంది. దీని వల్ల వ్యక్తిగత ప్రయాణం, సరకు రవాణా రెండింటికీ ప్రయోజనం కలగనుంది.  

ఆర్థిక వృద్ధి: మార్కెటింగ్ ప్రయోజనాలతోపాటు వనరులకు లభ్యత మెరుగుపడుతుంది. లాజిస్టిక్స్, తయారీ, పర్యాటక రంగాలకు లబ్ధిచేకూరనుంది.  

గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ అనుసంధానం: ఎక్స్‌ప్రెస్‌వే పర్యావరణానికి హాని కలగకుండా ఉండేలా నిర్మిస్తున్నారు.  అందులో భాగంగా పర్యావరణ ఎకో ఫ్రెండ్లీ నిర్మాణ పద్ధతులు పాటిస్తూ గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌లను కలపనున్నారు. 

సవాళ్ల సంగతేంటీ?ప్రాజెక్టు దాదాపు పూర్తి అయ్యే దశకు వచ్చినప్పటికీ ప్రారంభ దశలో భూసేకరణ సమస్యలు, పర్యావరణ అనుమతులు, లాజిస్టికల్ అడ్డంకులు అనేక సవాళ్లను ఎదుర్కొంది. అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకొని ప్రాజెక్టు పూర్తి కావొస్తోంది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌వే భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.   

హైదరాబాద్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో భవిష్యత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఒక నమూనాగా పని చేస్తుందని భావిస్తున్నారు. ఇది పూర్తి అయితే సమగ్ర ప్రాంతీయ ప్రణాళిక, స్థిరమైన అభివృద్ధికి దోహదపడనుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థికవృద్ధి, ప్రాంతీయ కనెక్టివిటీ పెంచి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. అందులో బాగంగానే హైదరాబాద్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్‌వే శర వేగంగా పూర్తి చేస్తోంది. ఇది రెండు నగరాల మధ్య ప్రయాణస్థితిగతులు మార్చేయనుంది. వేగవంతమైన, సురక్షితమైన, సమర్థవంతమైన రవాణాకు దోహదపడనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశ రవాణా నెట్‌వర్క్‌లో కీలకమైన పాత్ర పోషించనుంది.