Hyderabad IIIT Student Commits Suicide | హైదరాబాద్: గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ బీటెక్ (B.Tech) రెండో సంవత్సరం చదువుతున్న అభిరూప్ (20) అనే విద్యార్థి, తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన విద్యార్థిని ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అభిరూప్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అదే సమయంలో కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన మానసిక బాధ అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వేదన భరించలేకే భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి తోటి విద్యార్థులను, యాజమాన్యాన్ని విచారిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
