దేశంలో ఉన్న కార్పొరేట్ కుబేరులంతా ముంబైలోనే ( Mumbai) ఉంటారు. వారి వ్యాపారాలన్నీ అక్కడే ఉంటాయి. అందుకే ముంబైని దేశ ఆర్థిక రాజధాని అంటారు. అయితే ఇప్పుడు ముంబైకి హైదరాబాద్ ( Hyderabad ) నుంచి పోటీ ఎదురవుతోంది. ముంబై తర్వాత దేశంలో అత్యధిక మంది కోట్లీశ్వరులు ఉన్న నగరం హైదరాబాదే. ఫార్మా, బయోటెక్ రంగాలతో పాటు ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ పారిశ్రామికవేత్తలు సంపదను పోగేసుకోవడంలో దూసుకెళ్తున్నారు. కనీసం మూడు కోట్ల డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపుగా రూ. 220 కోట్ల సంపద కలిగిన వారు ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్‌లో వీరి సంఖ్య 467గా దిగ్గజ రియల్ ఎస్టేట్ ఎజెన్సీ నైట్ ఫ్రాంక్ ( KNIGHT FRANK ) అంచనా వేసింది.
మూడు కోట్ల డాలర్లకు పైగా సంపద ఉన్న వారిలో అత్యధికులు ముంబై నగరంలో ఉంటున్నారు. అక్కడ మొత్తం 1,596 మంది కుబేరులు ఉన్నట్లుగా నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సగానికంటే తక్కువగానే ఉన్నప్పటికీ హైదరాబాద్ లో వేగంగా కుబేరులు వృద్ధి చెందుతున్నట్లుగా గుర్తించారు స్టాక్ మార్కెట్ల జోరు, డిజిటల్ విప్లవం , ఫార్మా రంగం అభివృద్ది కారణంగా భారత్‌లో కుబేరుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోందని నైట్‌ఫ్రాంక్ అభిప్రాయపడుతోంది.
హైదరాబాద్ తర్వాత పుణె, బెంగళరు, కోల్ కతా, ఢిల్లీలో బిలీయనీర్లు ఉన్నారు. ఐదేళ్లలో ఢిల్లీలోని శ్రీమంతులు 101.2 శాతం పెరగగా.. ముంబైలో 42.6 శాతం, బెంగళూరులో 22.7 శాతం వృద్ధి నమోదైంది. వచ్చే ఐదేళ్లలో బెంగళూరులో వీరి సంఖ్య 89 శాతం పెరిగి 665కు చేరుకోవచ్చని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. దేశంలోని 69 శాతం అల్ట్రా రిచ్ ( Ultra Rich ) వ్యక్తుల సంపద ఈ ఏడాది మరో 10 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. 2026 నాటికి ప్రపంచంలో కుబేరుల సంఖ్య 28.4 శాతం పెరిగి 7,83,671కి చేరుకోవచ్చని అంచనా. వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య ఆసియా, ఆస్ట్రేలియాల్లో అత్యధికంగా 33 శాతం చొప్పున పెరగవచ్చని అంచనా.
మెట్రో సిటీల్లో వేగంగా అభివృద్ది చెందుతున్న సిటీగా హైదరాబాద్ మారింది. కరోనా తర్వాత ఫార్మాబయోటెక్ రంగాలకు కేంద్రంగా మారింది . ఇప్పటికే ఐటీ డెస్టినేషన్‌గా ఉంది.ఈ కారణంగా కొత్త కొత్త ఐడియాలతో వస్తున్న వారు కుబేరులుగా వృద్ధి చెందుతున్నారు. హైదరాబాద్‌ను ముంబైకి పోటీగా నిలబెడుతున్నారు.