తెలంగాణలో హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య దుమారం రేపుతోంది. ఉస్మానియా ఆస్పత్రి ముందు కుటుంబసభ్యలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో రవీందర్‌ మృతదేహానికి పోస్టుమార్టం కూడా ఆలస్యం అవుతోంది. పోస్టుమార్టం కోసం రవీందర్ కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు డీసీపీ సునీల్‌దత్‌. పోలీసుల నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో పోస్టుమార్టం కూడా ఇంకా మొదలుపెట్టలేదు డాక్టర్లు. 


ఇక, హోంగార్డ్ రవీందర్ మృతిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు షాహినాథ్‌ గంజ్ పోలీసులు. కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నట్టు A1గా కానిస్టేబుల్ చందు, A2గా ఏఎస్సై నర్సింగ్‌రావ్‌ను చేర్చారు.  జీతం గురించి అడిగితే ఏఎస్సై, కానిస్టేబుల్‌ అవమానించారని మరణ వాంగ్మూలం ఇచ్చాడు హోంగార్డ్ రవీందర్. దీంతో ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ కానిస్టేబుల్‌ చందు, ఏఎస్సై నర్సింగ్‌రావుపై కేస్ నమోదు చేశారు పోలీసులు.


మరోవైపు.. రవీందర్‌ కుటుంబానికి రాజకీయ పార్టీ నుంచి మద్దతు పెరుగుతోంది. అధికారుల ఒత్తిడి వల్లే రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. రవీందర్ భార్య చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. రవీందర్‌ కుటుంబసభ్యుల డిమాండ్లు పరిష్కరించాలన్నారు. రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, నష్టపరిహారం కింద 25 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. 


కాంగ్రెస్ పార్టీ నుండి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే... హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని హామీ కూడా ఇచ్చారు. హోంగార్డులందరూ రవీందర్‌ కుటుంబానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఉస్మానియా ఆస్పత్రికి హోంగార్డులను నీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హోంగార్డు చైర్మన్ నారాయణను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌రెడ్డి. 


వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ నియంత పాలన వల్ల మరో నిండు ప్రాణం బలైపోయిందన్నారు. రాష్ట్రాన్ని5లక్షల కోట్ల అప్పుల పాలు చేసినా కేసీఆర్‌కు.. హోంగార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న మనసు లేకపోవడం బాధాకరమన్నారు. హోంగార్డు రవీందర్ సకాలంలో జీతం అందకపోవడం వల్లే... పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రవీందర్ చావుకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమన్నారు షర్మిల. హోంగార్డుల జీవితాలు మారుస్తామని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారన్నారు. వారిని రెగ్యులరైజ్ చేస్తామని 2017లో కేసీఆర్ హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలు చేయలేదన్నారు షర్మిల. కేసీఆర్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలి దొరా అంటూ ప్రశ్నించారామె. హామీ ఇచ్చిన విధంగా 20వేల మంది హోంగార్డులను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి 50లక్షల రూపాయల పరిహారం చెల్లించి... ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా రవీందర్ మృతి బాధాకరమన్నారు. ఆయన భార్య సంధ్య తనకు పెద్దకూతురు లాంటిదని చెప్పారు. డీజీపీ అంజనీ కుమార్‌తో మాట్లాడి సంధ్య కుటుంబానికి న్యాయం చేయమని అడుగుతానన్నారు. అధికారులు పట్టించుకోకపోతే హోంగార్డు రవీందర్ భార్య తరపున హైకోర్టులో కేసు వేస్తా నని హెచ్చరించారు కేఏ పాల్‌. రవీందర్ కుమారులు మానస్, కౌశిక్‌ల చదువు భాద్యతలు తాను తీసుకుంటానన్నారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేస్తానన్నారు కేఏ పాల్‌. ప్రతి ఒక్కరూ సంధ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని పిలుపునిచ్చారు.