హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల నియంత్రణ కుక్క కాటు నివారణకు జీహెచ్ఎంసీ (GHMC) లో హై లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇటీవల హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్ని పార్టీల కార్పొరేటర్ లతో పాటు కమిషనర్, డిప్యూటీ మేయర్, స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కుక్కల నియంత్రణ, కుక్క కాటు ఇబ్బందులు లేకుండా చేయడానికి అంతే కాకుండా ఏ బి సి మానిటరింగ్ కమిటీ వేయాలని తీర్మానించారు. ఆ తీర్మానం మేరకు కుక్కల నియంత్రణకు హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 


ఈ హై లెవెల్ కమిటీలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, బీజేపీ నుండి బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్  పద్మ వెంకట్ రెడ్డి, మల్కాజ్ గిరి కార్పొరేటర్ వి.శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ నుండి లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ ఎం.రజిత, ఏ.ఐ.ఎం.ఐ.ఎం పార్టీ నుంచి పత్తర్ గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ, రియాసత్ నగర్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్ లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి కో- ఆర్డినేట్ ఆఫీసర్ గా డా.జె.డి విల్సన్ (డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరి) వ్యవహరించనున్నారు. ఈ హై లెవెల్ కమిటీ జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఉన్న ఎనిమల్ కేర్ సెంటర్లను పరిశీలించి అవసరమైన అభివృద్ధికి  సూచనలు, సలహాలు నివేదిక అందజేస్తారని కమిషనర్ తెలిపారు. 


బాలుడి ఘటనతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, బాధిట కుటుంబానికి పరిహారం  
ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. మొత్తం రూ.10 లక్షలను బాలుడి కుటుంబానికి అందజేయనున్నారు. జీహెచ్ఎంసీ రూ.8 లక్షలు, కార్పొరేటర్ల జీతం నుంచి రూ.2 లక్షల రూపాయాలు కలిపి మొత్తం పది లక్షల రూపాయాలను కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి పరిహారంగా చెల్లించనున్నట్లు ప్రకటించారు. కుక్కల బెడదపై కమిటీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైదరాబాద్‌లో (GHMC) పరిధిలో వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుక్కల దాడి ఘటనలను  దృష్టిలో ఉంచుకుని జీమెచ్ఎంసీ అధికారులు కొన్ని మార్గదర్శకాలు జారీచేశారు.


ఫిబ్రవరి 19న అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో  నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్‌ చనిపోవడం తెలిసిందే. తండ్రి పననిచేసే చోటుకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ కావడడంతో పిల్లల తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘాలు, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రెగ్యూలర్ గా ఇలాంటి ఘటనలు జరుగుతన్నా జీహెచ్ఎంసీ ఏ చర్యలు తీసుకోలేదని.. కుక్కుల విషయాన్ని గాలికొదిలేయడంతో చిన్నారి చనిపోయాడంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టు సైతం ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.