Sunday Funday In Hyderabad: హైదరాబాద్‌లో నేడు (ఆగస్టు 14), రేపు (ఆగస్టు 15) కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నేడు సండే ఫండే సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, రేపు ఆగస్టు 15 వేడుకల సందర్భంగా గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల వారు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేడు ట్యాంక్ బండ్ (Tank Bund) పైన సండే ఫండే (Sunday Funday) కార్యక్రమం జరగనుంది. కరోనా కారణంగా కొద్ది నెలల క్రితం నిలిచిపోయిన ఈ వినోద కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు మళ్లీ నిర్వహిస్తున్నారు. ఈ సండే ఫండే కార్యక్రమంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌ బండ్‌పై రాకపోకలను పూర్తిగా నిలిపివేసి కేవలం సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు, ఒగ్గుడోలు నృత్యాలు, ఇతర వినోద కార్యక్రమాలు జనాల్ని ఉత్తేజపర్చనున్నాయి.


అయితే, ఈ సండే ఫండే కార్యక్రమం జరగనున్నందున ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను మళ్లించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసు విభాగం ట్వీట్ చేసింది. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను ట్యాంక్ బండ్ పైకి అనుమతించరు. వారిని అంబేడ్కర్ స్టాట్యూ, తెలుగు తల్లి, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.


* తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ పైకి వచ్చే వాహనాలను అంబేడ్కర్ స్టాట్యూ, లిబర్టీ, హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు.


* కర్బాలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్, కవాడీగూడ డీబీఆర్ మిల్స్, లోవర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.


* డీబీఆర్ మిల్స్ నుంచి వచ్చే వాహనాలను గోశాల, కవాడీగూడ, జబ్బర్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ వైపు డైవర్ట్ చేస్తారు.


* ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను ఓల్డ్ సెక్రెటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా పంపుతారు.


పార్కింగ్ ప్రదేశాలు ఇవీ
* సండే ఫండే కార్యక్రమంలో ఎంజాయ్ చేసేందుకు వచ్చే వాహనదారుల సౌకర్యం కోసం పార్కింగ్ ప్రదేశాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ ఘాట్ రోడ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్క్ చేయవచ్చు.


* లిబర్టీ వైపు నుంచి వచ్చే వారు లోవర్ ట్యాంక్ బండ్ స్లిప్ రోడ్డులో పార్క్ చేయవచ్చు


* ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వారు ఎన్టీఆర్ స్టేడియంలో వాహనాలు నిలపాల్సి ఉంటుంది. 


* ఇక సికింద్రాబాద్ వైపు నుంచి వాహనాలు బుద్ధ భవన్ రోడ్డు, నెక్లెస్ రోడ్డులో పార్క్ చేయవచ్చు.






రేపు గోల్కొండ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు


75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం గోల్కొండలో వేడుకలను నిర్వహించనుంది. అందుకని ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామ్‌దేవ్‌ గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే రహదారిని మూసి వేస్తున్నారు. గోల్కొండ కోటకు వెళ్లే వివిధ రహదారుల దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. షేక్‌పేట్ నాలా, టోలీచౌకీ, సెవెన్‌ టూంబ్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయి. సాధారణ ప్రజలు షేక్‌పేట, టోలీటౌకీ ప్రాంతం నుంచి గోల్కొండ కోటకు చేరుకోవాలి. వారి వాహనాలను సెవెన్‌ టూంబ్స్‌ దగ్గర పార్క్‌ చేయాల్సి ఉంటుంది.