Hyderabad Begging Racket: రామ్ చరణ్ సినిమా నాయక్ చూశారా? అందులో ఓ చిన్న పిల్లాడు బిక్షాటన చేస్తూ రామ్ చరణ్ వద్దకు వస్తాడు. చిన్న వయసులో ఈ పని ఎందుకు చేస్తావంటూ రామ్ చరణ్ ప్రశ్నిస్తే అక్కడ జరిగే తంతు అంతా పిల్లాడు వివరిస్తాడు. ఓ రౌడీ చిన్న పిల్లలను యాచకులుగా మారుస్తాడని, కాళ్లు చేతులు విరుస్తాడని, కళ్లు పీకేస్తాడని చెబుతాడు. దీంతో అక్కడికి వెళ్లిన రామ్ చరణ్ రౌడీలను చితక్కొట్టి బెగ్గింగ్ మాఫియాను ప్రపంచానికి తెలిసేలా చేస్తాడు. 


సరిగ్గా అలాంటి సన్నివేశమే హైదరాబాద్‌లో జరిగింది. కాకపోతే సినిమాలో చిన్న పిల్లలు. కాని ఇక్కడ అంతా పండు ముసలి వాళ్లు. అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓ వ్యక్తి ముసలివాళ్లను తన మాఫియాలోకి దింపి సొమ్ము చేసుకుంటూ ఉన్నాడు. రోజు వారి నుంచి వేలకు వేలు సంపాదిస్తూ వారికి మాత్రం రెండు వందల రూపాయలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. దీని గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పక్కగా స్కెచ్ వేశారు. బెగ్గింగ్‌ మాఫియా గుట్ట రట్టు చేశారు. ప్రధాన నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. 


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన అనిల్‌ పవార్‌ అనే వ్యక్తి బెగ్గింగ్‌ మాఫియాకు తెరతీశాడు. వివిధ ప్రాంతాల నుంచి ముసలి వాళ్లను తీసుకువచ్చి వారితో బిక్షాటన చేస్తున్నాడు. నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్, కేబీఆర్‌ పార్క్‌లను కలెక్షన్ పాయింట్లుగా గుర్తించారు. అక్కడ అయితే రోజు వేలకు వేలు సంపాదించవచ్చని భావించాడు. వృద్ధులను అక్కడ బిక్షాటన చేయాలని ఆదేశించాడు. వారు రోజంతా కష్టపడి సంపాదించినది తాను తీసుకుని.. వారికి 200 రూపాయలు ఇస్తున్నాడు.


పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు బెగ్గింగ్‌ మాఫియాను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్‌ పార్క్ వద్ద బిక్షం ఎత్తుకుంటున్న మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద అనిల్ పవార్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అతడ్ని అరెస్ట్‌ చేశారు. బెగ్గింగ్‌ మాఫియాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  


నగరంలో యాచకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో చాలా వరకు ఒక ముఠాగా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతున్నారు. కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, పిల్లలను, ఆడవాళ్లను బిక్షం ఎత్తుకునేలా చేసి వారి నుంచి వేలకు వేలు పిండుకుంటున్నారు. వారిని రోడ్లపై అడుక్కోనిస్తూ వారి నుంచి వచ్చిన డబ్బుతో బెగ్గింగ్‌ మాఫియా సభ్యులు జల్సాలు చేస్తున్నారు.