హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లో అనుమానాస్పద రీతిలో లభ్యమైన రాజేశ్ మృత దేహం, గవర్నమెంట్ టీచర్ ఆత్మహత్య కేసులో కీలకమైన విషయాలను పోలీసులు కనుగొంటున్నారు. తాజాగా దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. వారి మరణానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు ఇద్దరూ చనిపోవాలని అనుకున్నారు? లాంటి వివరాలు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు స్పష్టమైన ఆధారాలను సేకరించారు. దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టుగానే పోలీసులు తేల్చారు. వారిద్దరి ఫోన్లలో ఉన్న సమాచారం సహా, సీసీటీవీ కెమెరాల ఆధారంగానూ పోలీసులు ఆధారాలు సేకరించారు. పూర్తి వివరాలతో పోలీసులు కేసును ఛేదించారు. 


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గవర్నమెంట్ టీచర్ కు, రాజేశ్ కు ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. ఓ మిస్డ్ కాల్ వీరిద్దరినీ కలిపింది. ఆ పరిచయం వ్యక్తిగత విషయాలు చెప్పుకొనే వరకూ వెళ్లింది. దాంతో ఆమెపై రాజేశ్‌ విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె తన ప్రైవేటు ఫొటోలను కూడా రాజేశ్‌కు పంపించింది. అప్పుడప్పుడూ ఆమెను చూసేందుకు రాజేశ్ ఇంటి చుట్టూ తిరిగేవాడు. ఇద్దరి వ్యవహారం అక్రమ సంబంధానికి సైతం దారి తీసింది. 


రాజేశ్‌ ప్రవర్తనతో ఆ గవర్నమెంట్ టీచర్‌ విపరీతమైన ఒత్తిడికి లోనైంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆమె మరింత డిప్రెషన్ కు గురైంది. ఈ నెల 24న వారు ఇద్దరూ చివరిసారి కలుసుకొని పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. హయత్‌ నగర్‌లోని ఒక దుకాణంలో రాజేశ్‌ పురుగుల మందు కొనుగోలు చేశాడు. ఈ నెల 24న ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె పురుగుల మందు తాగింది. రాజేశ్‌ కూడా అదే రోజు పురుగుల మందు తాగాడు. టీచర్‌ను ఆమె భర్త నాగేశ్వరరావు ఆసుపత్రిలో చేర్పించాడు. అలా చికిత్స పొందుతూ ఈ నెల 29న మృతి చెందింది. మరోచోట రాజేశ్ శవం స్థానికులకు లభ్యం అయింది.