Telangana Rising Global Summit 2025 | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం మధ్యాహ్నం ఈ సదస్సును ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్‌ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో రెండు రోజులు (డిసెంబర్ 8, 9 తేదీల్లో) ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకొని తెలంగాణ ముందుకెళ్తోందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. 2047లోగా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్లోబల్ సమ్మట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మహిళా రైతులను ప్రోత్సహిస్తున్నాం. వారికి బస్సులను సైతం ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నాం. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక వసతుల కల్పనకు, రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని’ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.

Continues below advertisement

మొత్తం ఆరు ఖండాల నుంచి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, కీలక వ్యక్తులు ఈ సదస్సులో భాగస్వామి అవుతున్నారు. అంతకుముందు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడున్న వారిని పలకరించి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా సహా ఇతర రంగాలకు చెందిన వారు ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొని సందడి చేశారు. వెయ్యి వరకు వాహనాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నటుడు నాగార్జున తదితర ప్రముఖులు హాజరయ్యారు.

గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంతెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు రెండు వేల మంది అతిథులు ప్రారంభ వేడుకకు హాజరుకానుండటంతో అక్కడ మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.. మరికాసేపట్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు..  తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే సహకారం, కంపెనీలకు ప్రోత్సాహకాతో పాటు తెలంగాణ భవిష్యత్తు కోసం రూపొందించిన విజన్‌ 2047 డాక్యుమెంట్‌ లక్ష్యాలను, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రాధాన్యత గురించి సదస్సుకు హాజరైన అతిథులకు సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు.

Continues below advertisement

 

మౌలిక సదుపాయాల కల్పనతోపాటు స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి, పరిశోధన, రంగాల్లో తెలంగాణతో భాగస్వామ్యంపై చర్చిస్తారు. రెండ్రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్ల వారీగా ప్రముఖులు ప్రసంగించనున్నారు. కొన్ని విషయాలపై కీలక చర్చ జరగనుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవృద్ధికి తెలంగాణ చేయాల్సిన కార్యాచరణపై విజన్ డాక్యుమెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు.

మూడంచెల సెక్యూరిటీ.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమ్మిట్ సందర్భంగా దాదాపు 6,000 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలిపారు. డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం, సదస్సు జరిగే ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ జోన్లు మరియు ఇతర ముఖ్య ప్రాంతాలలో భద్రతను పర్యవేక్షించడానికి అడిషనల్ డీజీపీలు (ADGPs), ఇన్స్పెక్టర్ జనరల్స్ (IGs), మరియు మరో 10 మంది ఐపీఎస్ (IPS) అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ అతిథులు, ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.