Telangana Lok Bhavan | హైదరాబాద్: నగరంలోని లోక్‌భవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవం (Republic Day 2026) సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్వహించిన 'ఎట్ హోం' (At Home) కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని రాజకీయ, న్యాయ, అధికార వర్గాలకు చెందిన వారి కలయికకు వేదికగా నిలిచింది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన ఈ తేనీటి విందులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) జస్టిస్ ఏకే సింగ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మరియు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు.
ఈ వేడుకలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ప్రజా ప్రతినిధులు ఒకే వేదికపై కనిపించడం విశేషం. గవర్నర్ అతిథులందరినీ సాదరంగా ఆహ్వానించి, వారితో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
