బిగ్‌ సస్పెన్స్‌కు తెరపడింది. తెలంగాణ వైపే ఫాక్స్‌కాన్ మొగ్గు చూపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేటర్ రాశారు ఆ సంస్థ ఛైర్మన్‌. దీంతో కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు తెరపడినట్టైంది. 


ఫాక్స్‌కాన్ పరిశ్రమను తెలంగాణ లేదా కర్ణాటకలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొంది. ఈ మధ్య ఓ కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ ఫాక్స్‌కాన్ రాష్ట్రానికి రాబోతోందని చెప్పారు. దానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. అక్కడి నాలుగు రోజుల తర్వాత సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు ఆ సంస్థ ఛైర్మన్. 


తెలంగాణలోనే ఫాక్స్‌కాన్ పరిశ్రమ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని... కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కోరారు. అంతేకాక, తైవాన్‌లో పర్యటించాలని యంగ్ ల్యూ  కేసీఆర్‌ను ఆహ్వానించారు.


ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’  సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో నాలుగు రోజుల క్రితం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ప్రభుత్వానికి మధ్య  ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.  ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది. 


ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని తెలంగాణ ప్రభుత వర్గాలు చెప్పాయి. అదే రోజు యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ ల్యూకి అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


తెలంగాణ‌లో ఫాక్స్ కాన్ పెట్టుబ‌డుల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ల‌క్ష మందికి ఉపాధి క‌ల్పించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను క‌లిసిన అనంత‌రం ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూ ప్ర‌క‌టించార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.


టీ-వర్క్స్‌ను ఫాక్స్‌కాన్‌ కంపెనీ చైర్మన్‌ యంగ్‌లూ ప్రారంభించిన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఆయన వెంటనే బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎంను కలవడంతో ఫాక్స్‌కాన్ తెలంగాణ చేజారిపోయిందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఫాక్స్‌కాన్ వివరణ ఇచ్చేలా సీఎం కేసీఆర్‌కు లెటర్ రాసింది. దీంతో అనుమానలన్నీ పటాపంచలు చేశారు. 


టీ వర్క్స్ ఏర్పాటులో ఫాక్స్ కాన్ కూడా సహకరించింది. ఫాక్స్ కాన్ సంస్థ ప్రపంచంలో తయారయ్యే సెల్ ఫోన్లలో అత్యధికం తయారు చేస్తుంది. యాపిల్ ఐ ఫోన్లను కూడా యాపిల్ సంస్థ ఫాక్స్ కాన్ ద్వారానే ఉత్పత్తి  చేయిస్తుంది.