Bhoodan Land Case: రంగారెడి జిల్లా భూదాన్ లాండ్ స్కామ్‌లో కీలక పరిణామాలు జరిగాయి. ఇప్పటికే ఈ కేసులో అధికారులను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. 16 విచారణకు రావాలని పిలుపునిచ్చింది.
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మెడకు భూదాన్ భూముల కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఆయన పాత్ర ఉందన్న అనుమానంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కాల్ చేసింది. దీంతో ఈ కేసులో మరో మలుపు ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు వంశీరాం బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి కూడా ఈడీ నోటీసులు సర్వ్ చేసింది. ఈ కేసులో సూర్యతేజ, సిద్ధారెడ్డి బాగా లాభపడినట్టు ఈడీ అనుమానిస్తోంది. దీన్ని క్లారిఫై చేసుకునేందుకు విచారణకు పిలిచింది.
భూదాన్ భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా నాగారం పరిధిలో దాదాపు 42 ఎకరాల భూములు తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. రైతుల ఫిర్యాదులతో దర్యాప్తు సంస్థలు స్పందించాయి. విచారణ చేస్తే డొంగ మొత్తం కదులుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా ఇందులో భాగమై ఉన్నారని తెలుస్తోంది.
మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, తహసీల్దార్‌గా పని చేసిన జ్యోతి, ఆర్డీవో వెంకటాచారిపై కేసులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విచారించింది. కొన్ని కీలక విషయాలు రాబట్టింది. అయితే ఇందులో మానీలాండరింగ్ జరిగిందని గుర్తించిన ఈడీ... విచారణలో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే అమోయ్ కుమార్‌ను విచారించింది.