Wanaparthy News | తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడు అనుకున్న వ్యక్తి లేచి కూచున్న సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో వైరల్ గా మారింది. వనపర్తి కి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమ కారుడు. తెలంగాణ ఉద్యమంలో మాజీమంత్రి బి. నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేశాడు. ఈ క్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కి రమేష్ వీరాభిమానిగా మారాడు. నిరంజన్ రెడ్డి పై ఉన్న అభిమానానికి గుర్తుగా తన గుండెపై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫొటో పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు.
హైదరాబాద్ లో ఉండే తైలం రమేష్ వనపర్తి కి వచ్చి ఆదివారం ఉదయం అస్వస్థత కు గురయ్యాడు. ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో మరణించాడని భావించారు. అంతిమ సంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పడుకొబెట్టి పూలమాలలు వేశారు. దహన సంస్కారాల కోసం డబ్బులు ఇచ్చేశారు.
విషయం తెలుసుకున్న BRS మాజీమంత్రి నిరంజన్ రెడ్డి తైలం రమేష్ ను చివరి చూపు చూసేందుకు ఇంటికి వెళ్ళాడు. పూల మాల వేసేందుకు ముందుకు వంగటంతో బాడీలో కదలిక ఉన్నట్లు గుర్తించారు. ''రమేష్... రమేష్ " అంటూ గట్టిగా పిలవటంతో మరింతగా కదలాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేయగా ఈరోజు రమేష్ తిరిగి ప్రాణలతో బయటపడ్డాడు.