KCR: విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద రైతు చిన్రాజు సత్తయ్య మరణించాడు. సత్యయ్య కుమారుడు నవీన్ స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బి టెక్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు పెద్దోళ్ల సాయి సైతం  ప్రమాదవశాత్తు ఇటీవల మరణించారు. పెద్దోళ్ల సాయి కొడుకు అజయ్ సైతం స్థానికంగా బి టెక్ చదువుతున్నాడు. కుటుంబాన్ని నడిపించే పెద్దదిక్కు తండ్రి చనిపోవడంతోపాటు, ఆర్థికంగా ఫీజు చెల్లించలేని పరిస్థితి ఉండటంతో కేసీఆర్ ను ఆశ్రయించారు విద్యార్దుల కుటుంబ సభ్యులు. వీరిద్దరి ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసేందుకు అవసరమైన ఫీజులను బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చెల్లించారు. వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ కోసం కూడా ఆర్థిక సాయం చేశారు. విద్యార్దులకు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో విడి విడిగా చెక్కులు అందించారు.

Continues below advertisement

కష్టపడి చదువుకోండి బిడ్డా..

"కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డా.. మీరు కష్టపడి గొప్ప స్థాయిని చేరుకోవాలె. మీరు.. ఫీజుల కోసం భయపడొద్దు. యే సమస్య వచ్చినా నేనున్నా.." అంటూ భరోసా ఇస్తూ విద్యార్దులను కేసీఆర్ ఆశీర్వదించారు. కాగా విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక సహాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, ఆర్థికంగా ఆదుకున్నారని, తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన కేసీఆర్ కు విద్యార్దుల తల్లులు తమ కృతజ్ఞతను తెలియజేశారు. తమ చదువుకోసం భరోసాగా నిలిచిన కేసీఆర్ కు ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

Continues below advertisement