కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను విడిచిపెట్టబోమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వారి గురించి పోలీస్ స్టేషన్ లోనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఒకవేళ వారు కూడా స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్లీ చట్ట సభల్లో అడుగు పెట్టకుండా రాజకీయంగా పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. టీపీసీసీ నాయకులు శుక్రవారం (జనవరి 6) మధ్యాహ్నం దాటాక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీస్ స్టేషన్ లో కనీసం ఉన్నతాధికారులు కూడా అందుబాటులో లేరని విమర్శించారు. ‘‘పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకున్నారు. అందుకే 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. అయినా కేసీఆర్ ఆలోచనలో మార్పు రాలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించారు. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారు. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిరాయింపులకు ప్రోత్సహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో ఫిర్యాదు చేసింది.


ఫిర్యాదులపై స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదు. పార్టీ ఫిరాయించిన శాసన సభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం వద్దకు చేరాయి. రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ కేసును కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన 12 మందిపై కూడా విచారణ చేయాలి. పోలీస్ స్టేషన్ కు వస్తే ఉన్నతాధికారులు లేకపోవడం దురదృష్టకరం.


455 ఎఫ్ఐఆర్ తో పాటు మేం ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించి విచారణ చేపట్టాలి. కేసీఆర్ ఫిరాయింపు రాజకీయానికి సమాధి కట్టాలి. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను ఛేదించాలి. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. పోలీస్ స్టేషన్ లోనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా వివరాలతో ఫిర్యాదు చేస్తాం. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. అవసరమైన ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్ట సభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ పోరాటం చేయడానికి కూడా వెనకాడం’’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.