Telangana Latest News: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య(ఫాతి) డిమాండ్ చేసింది. మూడేళ్లుగా ఉన్న పెండింగ్‌ రాక ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, మంత్రులతో సమావేశమై పరిష్కరించుకోవాలని యోచిస్తున్నారు. ఈవిద్యాసంవత్సరంలో ఎలాంటి విధానాన్ని అనుసరించాలో కూడా ఫాతి వెల్లడించింది. 

తెలంగాణ ప్రబుత్వం ఉన్నత విద్యా సంస్థలకు 7000కోట్లకుపైగా బకాయి పడి ఉంది. మూడేళ్లుగా కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదని ఫాతీ పేర్కొంది. ఒకేసారి తాము ఇవ్వమని చెప్పడం లేదని విడుదల వారీగా ఇవ్వాలని తెలిపారు. మొదటి విడత 1650 కోట్ల రూపాయలను జూన్ 30 నాటికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదికో అదిగో అంటూ చెబుతున్నారే తప్ప చెల్లింపు జరగడం లేదని తెలిపారు.   

మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాలు, ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA, లా కోర్సులు అందించే కళాశాలలకు 7,000 కోట్లు రావాల్సి ఉంది. ఈ డబ్బులు రాక అప్పులు పెరిగిపోతున్నాయని అన్నారు. దీని ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోందని ఫాతి పేర్కొంది. దీంతో కళాశాలల, విద్యార్థుల భవిష్యత్‌పై అనిశ్చిత నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. 

మొత్తం బకాయిలు ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండొచ్చని అయితే ముందుగా 2023-24 విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ మూడు నెలల్లోపు చెల్లించాలని సూచించింది. 2024-25 విద్యా సంవత్సరానికి డిసెంబర్ 30 నాటికి విడుదల చేయాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది. 2022-23 ఏడాది పెండింగ్ బిల్లులను జూన్ చివరి నాటికి 1,600 కోట్లు విడుదల చేయాలని ఫాతి జనరల్ సెక్రటరీ జి నాగయ్య సూచించారు. 

దీనిపై నేరుగా ప్రభుత్వ పెద్దలతో సమావేశమై తమ బాధలు చెప్పుకోవాలని భావిస్తున్నాయి ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో భేటీ అయ్యి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల జాప్యంతో జరుగున్న నష్టాన్ని వివరించనున్నాయి. ఈ కారణంగా యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తెలపాలని తేల్చాయి.  అంతే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంఘాలతో కూడా సమావేశం కావాలని నిర్ణయించింది ఫాతి. బకాయిలు పేరుకుపోకుండా ఉండేందుకు ఓ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉంది. నాలుగు విడతలుగా కళాశాలలకు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేయాలని, విద్యా సంవత్సరం పూర్తి అయ్యే నాటికి బకాయిలు లేకుండా చూడాలని అభ్యర్థిస్తోంది. ఆ దిశగా కచ్చితమైన విధి విధానాలు పాటించాలని కోరుతోంది.