Explosion at LB Nagar Chutneys restaurant:  ఎల్బీనగర్ రింగ్ రోడ్డు సమీపంలోని చట్నీస్ హోటల్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. గతంలో బెంగళూరు రామేశ్వరం హోటల్ లో ఇలాగే పేలుడు సంభవించిన ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయం ఉండటంతో  అలాంటిదేమైనా జరిగిందేమో అని అందరూ కంగారు పడ్డారు. అయితే  కాసేపటికి అలాంటిదేమీ లేదని తేలింది. హోటల్ వంటగదిలో ఇడ్లీలు తయారు చేసే ఇడ్లీ స్టీమర్ లో ప్రెజర్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో అది భారీ శబ్దంతో పేలిపోయినట్లుగా గుర్తించారు. ఈ పేలుడు ధాటికి హోటల్‌లో ఉన్న కస్టమర్లు బాంబు పేలిందేమోనన్న భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. హోటల్ లోపల సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడ  గందరగోళంగా ఏర్పడింది. 

Continues below advertisement

ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు – ఆస్పత్రికి తరలింపు  ఈ ప్రమాద సమయంలో వంటగదిలో పని చేస్తున్న ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీమర్ పేలిన వేగానికి , వేడి నీటి ఆవిరి వల్ల వారి శరీరాలు కాలినట్లు సమాచారం. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం  

Continues below advertisement

ప్రమాదం జరిగిన వెంటనే చట్నీస్ యాజమాన్యం బయటి వ్యక్తులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హోటల్ షట్టర్లు దించి, జరిగిన విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారని స్థానికులు మండిపడుతున్నారు. కస్టమర్ల భద్రత కంటే హోటల్ ప్రతిష్టకే ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 విచారణ ప్రారంభం                సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, సాక్ష్యాలను సేకరించారు. స్టీమర్ నిర్వహణలో లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్ లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.