వచ్చే తెలంగాణ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఎన్నికల గురించి గాంధీ భవన్‌లో నేడు (ఆగస్టు 29) పీఈసీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు టికెట్ల విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి రెండు టికెట్ల అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని రేవంత్ చెప్పగా, పీసీసీ చీఫ్‌గా రేవంతే అధిష్ఠానానికి చెప్పాలని ఉత్తమ్ అన్నారు. ఈ సందర్భంగా రెండుసీట్ల చర్చ ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. ఎవరిని టార్గెట్‌ చేసి చర్చ చేస్తున్నారంటూ ఉత్తమ్‌ సీరియస్‌ అయ్యారు. 


దీంతో నాకు చెప్పడానికి నువ్వెవరు అంటూ ఆగ్రహంతో రేవంత్ సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. మరో వైపు బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని వి.హనుమంత రావు అడిగారు. ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారో చెప్పాలని బలరాం నాయక్ అడిగారు.


సమావేశం తర్వాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక మీద చర్చ జరిగింది. ఇది మొదటి సమావేశం మాత్రమే. ఆ రెండు సీట్ల మీద అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.


మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలంటూ రేణుకా చౌదరి నిలదీసినట్లు సమాచారం. మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చేది ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించడంతో పాటు.. అలాగే, పీఈసీలో ఒక్కో సభ్యుడు ఒక మహిళా అభ్యర్థిని సిఫార్సు చేయాలని అన్నారు. సర్వేలపై మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌ సీరియస్‌ అయ్యారు. సర్వే ఆధారంగా టికెట్లు ఇచ్చేటప్పుడు ఈ ప్రక్రియ ఎందుకని నిలదీశారు. సర్వేలను ఏ ప్రాతిపదికన చేస్తున్నారో చెప్పాలని అన్నారు.