Just In





KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Congress SC declaration In Telangana | హైదరాబాద్: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీ జాతీయ నేతలు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలుకూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన మోసాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ డిక్లరేషన్ అమలులో పూర్తిగా విఫలమైంది, దళిత డిక్లరేషన్ ఇచ్చిన హామీల సంగతి ఏమైంది. ఎస్సీ డిక్లరేషన్ అంశంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పాపాలకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి (Revanth Reddy) లాంటి మోసగాడు చెప్తే నమ్మరని, మల్లికార్జున ఖర్గేను తెలంగాణకు రప్పించి మరీ ఎస్సీ రిజర్వేషన్ ప్రకటన చేయించారు. మల్లికార్జున ఖర్గే మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.
రేవంత్ రెడ్డి లాంటి మోసగాడి పాలన ఈరోజు చూసుంటే రాజ్యాంగ నిర్మాతలు రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టేవారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు తెలంగాణ భవన్‌లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అసమర్ధ పాలనతో ఎండిన పొలాలు, అన్ని వర్గాల కళ్లళ్లోనూ నీళ్లు.. కాంగ్రెస్ అంటే కరువు.. కరువు అంటే కాంగ్రెస్! అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నాడు బీఆర్ఎస్ హయాంలో పంటలు పచ్చగా కళకళలాడేవి. నేడు కాంగ్రెస్ పాలనతో పొలాలు ఎండిపోతున్నాయి. కక్షతో కాళేశ్వరం పంపులను పడావుపెట్టి, నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కనపెట్టారు. గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరదలు వచ్చినా నీటిని ఒడిసిపట్టుకోకుండా వదిలేసిన ఫలితం ఎండిన పంట పొలాలు అన్నారు. తాగునీళ్లు లేక గొంతులు తడారుతున్నాయి.
పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయె. తలాపునా పారుతుంది గోదారి. మన సేను, మన సెలుక ఎడారి. నాడు కేసీఆర్ గారి పాలనలో జలకళ కనిపిస్తే.. నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో విలవిల. నాడు ఇంటింటికి నల్లానీళ్లు రాగా, నేడు ఆడబిడ్డల కండ్లల్లో కన్నీళ్లు. ఇది శ్రీశైలం, సాగర్ జలాశయాలను ఏపీ సర్కారు ఖాళీ చేస్తున్నా నోరెత్తని కాంగ్రెస్ సర్కారు తప్పిదం. కాళేశ్వరం నుండి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ గారి మీద కక్షతో రిజర్వాయర్లను, చెరువులు, కుంటలు నింపని కాంగ్రెస్ పాపం. ఇది కాలం పెట్టిన శాపం కాదు. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పెట్టిన శఠగోపం. జాగో తెలంగాణ జాగో!’ అని ఎక్స్ ఖాతాలో కేటీఆర్ పోస్ట్ చేశారు.