MLA Seethakka: తెలంగాణ కాంగ్రెస్ లో హైడ్రామా క్లైమాక్స్ కు చేరింది. టీడీపీ నుంచి వచ్చిన వారికే పదులు అంటూ సీనియర్ల విమర్శలు చేయడంతో.. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 13 మంది తమ పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. తమకు పదవులు వద్దని, పదవులు రాని వారికి ఇవ్వాలని ఆ నేతలు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కి రాజీనామా లేఖలు పంపారు నేతలు. అయితే ఇందులో ములుగు ఎెమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడారు.
పదవుల కోసం తాము కాంగ్రెస్ లో రాలేదని సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చామని పేర్కొన్నారు. తమను విమర్శిస్తున్న సీనియర్లు ఆలోచించుకోవాలని సూచించారు. అలాగే తనకు పదవి లేకపోయినా పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని వివరించారు. అలాగే నిఖార్సయిన కాంగ్రెస్ వాదులు అంతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పక్కకు వెళ్లిపోరని.. కానీ తాము కాంగ్రెస్ లోకి వచ్చాక పార్టీ ప్రతిపక్షంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అందరూ కలిసి పని చేస్తారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ వర్గం సన్నద్ధం
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలకు రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ లో ఉంటూ ఇతర పార్టీలకు ఎలా సాయం చేస్తున్నారో బయటపెట్టేందుకు కార్యకర్తలకు చెప్పాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ సీనియర్ల వర్గం కుట్ర చేస్తుందని రేవంత్ వర్గం ఆరోపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు అసంతృప్తి నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం. సోమవారం ఏఐసీసీ కార్యదర్శులు అసంతృతప్తి నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముందు నుంచీ అసంతృప్తి
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో కాంగ్రెస్ లో అసమ్మతి మొదలైంది. ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని, టీడీపీ నుంచి వలస వచ్చిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై సీనియర్ నేతలు ముందు నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. అధిష్ఠానం నిర్ణయంపై గౌరవంతో ఇన్నాళ్లు ఆ నేతలు అసంతృప్తిగా ఉన్నా పార్టీలోనే కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి వంటి నేతలు పార్టీని వీడారు. తాజాగా కమిటీల కూర్పు విషయంలో ఈ అసంతృప్తి మరింత పెరిగి కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగా రేవంత్ పై విమర్శలకు దిగారు. పార్టీ సీనియర్ల సహకారం లేకుండా రేవంత్‌రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికంగా మారింది.