Command Control Centre Inauguration: దేశంలోనే తొలిసారి వినూత్న కట్టడం.. పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నత అధికారులంతా ఒకే చోట నుండి రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ మ్యానిటరింగ్, కమాండ్ కంట్రోల్ చేసేందుకు వీలుగా అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. విదేశీ టెక్నాలజీని వాడుకుంటూ అధునాతన సాంకేతిక పరిజ్జానంతో హైదరబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మించిన తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఈరోజు ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్యాహ్నం 1.16 నిమిషాలకు ప్రారంభించనున్నారు. నేటి నుండి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలను నేరుగా మానిటరింగ్ చేయనున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా మానిటరింగ్..


హైదరాబాద్ లో ఇప్పటి వరకూ మూడు కమీషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కు వేరు వేరు విభాగాలు, ఆయా ఉన్నతాధికారుల కార్యాలయాలతో పాటు ట్రాఫిక్ కు ప్రత్యేక విభాగం ఉండేది. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న కమీషనరేట్లను, ఆయా ఉన్నతాధికారులు కార్యాలయాలను నేరుగా కొత్తగా నిర్మించిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరలించునున్నారు. ఇకపై ఇక్కడి నుండే అన్ని విభాగాల ఉన్నతాధికారులు పని చేస్తారు. డీజీపీతో పాటు హైదరాబాద్ సీపీ, ఏసీపీ... ఇలా ఇక్కడే అందుబాటులో ఉంటారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా భద్రత నేపధ్యంలో ఏర్పాటు చేసిన లక్షలాది సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తారు. ఇక్కడి నుండే తెలంగాణ వ్యాప్తంగా క్రైమ్ మానిటరింగ్ చేస్తారు. ఇందులోని నాలుగవ అంతస్దులో అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ డేటా సెంటర్‌ లో బెల్జియం సర్వర్లను ఏర్పాటు చేశారు. లక్షలాది సీసీ కెమెరాలను ఇక్కడి నుండే ఓకేసారి వీక్షించే విధంగా ఎల్ ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.


ఐదు విభాగాలుగా విభజించి..


తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. మొత్తం 6.42 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఈ కార్యాలయం నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇందులో 4.26లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో భవన నిర్మాణం ఉండగా, 2.16 లక్షల ఎస్ఎఫ్టీ విస్తీర్ణం పార్కింగ్ కోసం కేటాయించారు. అంటే ఏక కాలంలో ఇక్కడ 400 ఫోర్ వీలర్స్, 350 టూవీలర్స్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఈ కమాండ్ సెంటర్ ను ఐదు విభాగాలుగా విభజించారు. అవి టవర్ ఏ, బీ, సీ, డీ, ఈ. మొదట టవర్ ఏలో 20 అంతస్తులు ఉంటాయి. ఇందులో హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనరేట్ ఉంటుంది. టవర్ బీలో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో డయల్ 100, షీ సేప్టీ, సైబర్ అండ్ నార్కోటిక్స్, క్రైమ్స్ విభాగాలు ఉంటాయి.


నేరుగా హెలికాప్టర్ లో వెళ్లేలా..


టవర్ సీలో 480 సిట్టింగ్ కెపాసిటీ కలిగిన ఆడిటోరియం ఉంటుంది. టవర్ డీలో మీడియా మరియు ట్రైనింగ్ సెంటర్ కు కేటాయించారు. మొత్తం నిర్మాణంలో టవర్ ఈ కీలకమైనది. ఇది మధ్యలో ఉన్న ఏరియా. ఇందులో కమాండ్ కంట్రోల్ మరియు డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. సీసీ టివీ మానిటరింగ్ తోపాటు వార్ రూమ్, రిసీవింగ్ రూమ్ కు కేటాయించారు. ఈ నిర్మాణంలో మరో హైలెట్ ఏమిటంటే పైభాగంలో హెలిపాడ్ ను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండే నేరుగా హెలికాప్టర్ లో వివిధ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇలా విదేశాల్లో సాంకేతికతను ఉపయోగిస్తూనే గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దారు. కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని వైపులా పచ్చటి తోరణం కట్టినట్లుగా మొక్కలు నాటించారు. ఆహ్లదకర వాతావరణంతో దేశంలోనే తలమానికంగా తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మెరుగైన సేవలను అందించేందుకు సిద్దం అయింది.