CM KCR: తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరిత హారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.


గతంలో తాను హరితహారం అంటే నేతలు, అధికారులకు అర్థం కాలేదన్నారు సీఎం కేసీఆర్. హరితహారాన్ని చాలా మంది హస్యాస్పదం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు అయితే జోకులు వేశారని గుర్తు చేశారు. కానీ హరితహారం ద్వారా రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని.. అందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. మహేశ్వరంలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా శంషాబాద్ నుంచి మహేశ్వరం వరకు మెట్రోను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. బీహెచ్ఈఎల్ నుంచి మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రోపై చర్చలు జరుగుతున్నాయన్నారు. అలాగే తుమ్ములూరులో విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నామని... కమ్యూనిటీ హాల్ కు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్, ప్రభుత్వ ఉన్నత అధికారుల పాల్గొన్నారు. అంతకుముందు సఫారీ వాహనంలో పార్కులో కలియతిరిగిన సీఎం కేసీఆర్.. ఫొటో ఎగ్జిబిన్ ను, అటవీ అధికారుల సామగ్రిని తిలకించారు. అనంతరం బీటీఆర్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 









హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా 2015లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో.. ఈ కార్యక్రమం చేపట్టారు. మే 2023 నాటికి 273.33 కోట్ల మొక్కలు నాటారు. తెలంగాణ గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ధృవీకరించింది. సీఎం కేసీఆర్ సర్కారు ఎనిమిదేళ్లలో నాటిన 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్ తో పాటు ఆహ్లాదాన్ని పెంచుతున్నాయని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచిందన్నారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమం కోసం రూ.10,822 ఖర్చు చేసిందన్నారు. మంత్రి కేటీఆర్ కూడా హరితోత్సవంపై స్పందించారు. ప్రపంచ చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం అని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.