Children missing in Nampally fire Accident : హైదరాబాద్‌లోని నాంపల్లి చీరక్‌గల్లిలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కు రావాలనుకున్నవారు తమ పర్యటనను వాయిదా వేసుకోవలాని సజ్జనార్ కోరుతున్నారు. కలెక్టర్ కూడా అదే సలహా ఇచ్చారు. నాంపల్లి వైపు రాకపోకలు సాగించేవారు వేరే మార్గాలు చూసుకోవాలన్నారు.    

ఫర్నీచర్ షోరూంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదం ప్రాంతాన్ని భయానక వాతావరణంలోకి నెట్టింది. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.   భవనంలో ఇద్దరు చిన్నారులు,  కొంతమంది సిబ్బంది చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. మొత్తం 5 ఫైర్ ఇంజన్ల సాయంతో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది సాహసోపేతమైన చర్యలు చేపట్టారు. భవనంలోని నాలుగో అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో, కిటికీలు,  గ్రిల్స్‌ను తొలగించి లోపలి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఆటంకాలు ఎదురయ్యాయి. మొదటగా రోబోను పంపి బాధితులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ బవనంలో ఉన్నవారి పరిస్థితపై మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.  

ఈ భారీ ప్రమాదం వల్ల కోట్ల రూపాయల విలువైన ఫర్నీచర్, ముడి సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఫర్నీచర్ దుకాణం కావడంతో అక్కడ ఉన్న పాలిష్ కెమికల్స్, కలప కారణంగా మంటలు అదుపులోకి రావడం కష్టమైంది. భవనం ఇరుకైన గల్లీలో ఉండటంతో భారీ క్రేన్లు, పెద్ద ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లేందుకు వీలు లేకపోయింది. దీంతో సిబ్బంది పైపులను సుదూరం నుంచి లాగి మంటలను ఆర్పివేయాల్సి వచ్చింది. డీఆర్ఎఫ్  బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని కూలిపోయే స్థితిలో ఉన్న భవన భాగాలను పరిశీలిస్తున్నాయి. 

 షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి విచారణ తర్వాతే కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో అబిడ్స్ - నాంపల్లి మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నారు.