MLA Harish Rao counters to Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో జరిగిన స్టాఫ్ నర్సుల నియామక పత్రాల అందజేత సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ సిబ్బందికి నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని విమర్శించారు. తాము ఊహించినట్లు గానే తామే రిక్రూట్మెంట్ చేసినట్లు డబ్బా కొట్టుకున్నారని అన్నారు.


ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని రేవంత్ రెడ్డి కల్లి బొల్లి మాటలు చెప్పారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తన అబద్ధాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.


ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చారా రేవంత్ రెడ్డి చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘‘మాకు కుళ్ళు లేదు కడుపులో నొప్పి లేదు. సొమ్మొక్కడిది సోకు ఇంకొకడిది అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరునే తప్పు బడుతున్నాం. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన విషయాన్ని మరచిపోవద్దు. నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవాలు తెలుసు. తెల్లారితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లారు. అయన ప్రసంగంలో దీని గురించి ఒక్క మాట లేదు.


గ్రూప్ - 1 నోటిఫికేషన్ ఏది?
ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1వ తారీఖున గ్రూపు 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేశారు. పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు గుప్పించారు. ఇప్పుడు నోరూ మెదపడం లేదు. మేము యదార్థం చెబితే, శాపనార్థాలు అని మాట్లాడారు తప్ప నోటిఫికేషన్ల గురించి చెప్పలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని నీటి మూటలే అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారు. 


రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పెంపు, రూ.500 లకు సిలిండర్, రూ.4 వేల నెలవారీ పింఛను, మహాలక్ష్మి ద్వారా రూ.2,500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి అమలు కానీ హామీల లిస్ట్ లో నేడు జాబ్ క్యాలెండర్ కూడా చేరింది. 


అసలు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది 10 వేల ఉద్యోగాలు మాత్రమే కాదా? అపుడు నిరుద్యోగ యువతను మోసం చేసింది చాలక ఇపుడు మరో సారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు?


రేవంత్ మాట్లాడినదంతా డొల్ల
ఉద్యోగ నియామకాల్లో మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. తొమ్మిదిన్నర ఏళ్లలో లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా..? కేసీఆర్ ప్రభుత్వం మీద ఉద్యోగాల భర్తీకి సంబంధించి  రేవంత్ మాట్లాడినదంతా వట్టి డొల్ల అని నేటి కార్యక్రమం రుజువు చేసింది.


2 లక్షల ఉద్యోగాల భర్తీకి మీరు చేసిన వాగ్ధానాన్ని  నిలుపుకుంటే స్వాగతిస్తాం. సీఎం హోదాలో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దు. రోజూ అబద్దాలు మాట్లాడే రేవంత్ కు కనీసం కాంగ్రెస్ అధిష్టానం అయినా గడ్డి పెట్టాలని కోరుతున్నా’’ అని హరీశ్ రావు ఎక్స్ లో ఓ పోస్టు చేశారు.