BJP Leaders Fight: తెలంగాణ బీజేపీలో మరోసారి వర్గపోరు వెలుగుచూసింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ పార్టీలో నాయకుల మధ్య తగువులాటలు ఎక్కువవుతున్నాయి. వర్గపోరుతో నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. కొన్ని రోజుల క్రితం నాంపల్లి, కూకట్ పల్లి బీజేపీ ఆఫీసుల్లో జరిగిన కీచులాటలు మర్చిపోకముందే.. మరో వర్గపోరు వెలుగు చూసింది. స్వాతంత్ర్య దినోత్సవాల వేళ బీజేపీ నేతలు కొట్లాడుకున్నారు. జెండా ఎగురవేసే విషయంలో తలెత్తిన వివాదం కాస్త ఘర్షణకు దారి తీసి ఒక వర్గం వారు మరో వర్గం వారిపై దాడికి దిగారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజవర్గం హిమాయత్ నగర్ డివిజన్ లో ఈ ఘటన జరిగింది. 


నిన్న స్వాతంత్ర్య దినోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, స్థానిక కార్బొరేటర్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కార్పొరేటర్ భర్తకు గాయాలు అయ్యాయి. జాతీయ జెండా సాక్షిగా కమలం పార్టీ కార్యకర్తలు కొట్టుకున్న ఈ ఘటన ఢిల్లీ పెద్దల వరకు వెళ్లింది. ఈ కొట్లాటపై ఇరు వర్గాల నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే..


స్వాతంత్ర్యం దినోత్సవం కావడంతో హిమాయత్ నగర్ డివిజన్ లోని విఠల్ వాడీలో బీజేపీ కార్యకర్త అనిల్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తో పాటు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్ ను ఆహ్వానించారు. అయితే చింతల రామచంద్రారెడ్డి మొదటగా అక్కడికి వచ్చారు. 20 నిమిషాల పాటు కార్పొరేటర్ కోసం వేచి ఉన్నారు. అయినా కార్పొరేటర్ మహాలక్ష్మీ గౌడ్ రాకపోవడంతో.. చింతల తన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వెనుదిరగ్గా.. అదే సమయంలో మహాలక్ష్మి గౌడ్, తన భర్త రామన్ గౌడ్ తమ అనుచరులతో వచ్చారు. కార్పొరేటర్ వర్గీయుల్లో ఒకరు మేం రాకుండా జెండా ఆవిష్కరిస్తారా.. నువ్వు అంత పెద్ద రాజకీయం చేసేవాడివి అయ్యావా అంటూ అనిల్ ను ప్రశ్నించారు.


మీరు రావడం ఆలస్యమైంది. సార్.. ఇంకో చోటకు వెళ్లాల్సి ఉంది. అందుకే ఆవిష్కరించారని జవాబిచ్చారు అనిల్. ఈ సమయంలో మాటామాటా పెరగడంతో చింతల, రామన్ వర్గం బాహాబాహీకి దిగారు. ఈ దాడిలో కార్పొరేటర్ భర్తతో పాటు పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ఈ గొడవపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇరు వర్గాల వారు ఫిర్యాదు చేసుకున్నారు. ఎన్నికల ముందు, అందులోనూ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున ఏంటీ గొడవలు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.పార్టీకి నష్టం చేసే పనులు చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. 


Also Read: Krishna River: వర్షాలు లేక కృష్ణమ్మ వెలవెల, తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి నిల్వ


ఈ ఘటనపై కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్ భర్త రామన్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. వెనకబడిన వర్గానికి చెందిన తమను చింతల రామచంద్రారెడ్డి అణిచి వేస్తున్నారని కంటతడి పెట్టారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతుంటే చింతల చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి రామన్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే టికెట్ విషయంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే నియోజకవర్గంలో ఇరు వర్గాల వారు ప్రతి కార్యక్రమంలో అంటీ ముట్టనట్లుగా, ఉప్పు- నిప్పుగా ఉంటున్నట్లు తెలుస్తోంది.