మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం... ఇప్పుడున్న రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్  చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పుడున్న రాజ్యాంగం అవసరం లేదన్నట్టు కేసీఆర్ కామెంట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకొని కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నాయి. ఈ కామెంట్స్‌ను ఇప్పటికే ఆయా పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సినవి కావంటూ విమర్శలు చేశారు. 


బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ఇద్దరూ దిల్లీలోనే ఉన్నారు. అందుకే అక్కడి నుంచే వేర్వేరుగా ఉద్యమ కార్యచరణ చేపట్టారు. 


బీజేపీ ఎంపీలతో కలిసి దిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు బండి సంజయ్‌. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ‘మౌన దీక్ష చేస్తున్నట్టు బండి సంజయ్‌ ప్రకటించారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంసహా పలువురు పార్టీ నేతలతో కలిసి ‘మౌన దీక్ష’ చేస్తారు. 


ఉదయం 11 నుంచి రాజ్‌ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేద్కర్‌ను అవమానించిన కేసీఆర్‌ను రాజ్యాంగ ద్రోహిగా దేశ ప్రజల దృష్టికి  తీసుకెళ్లాలని భావిస్తోంది బీజేపీ. 


ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టకూడదని బండి సంజయ్ భావిస్తున్నారు. దళిత సీఎం విషయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం, దళిత బంధును ఎన్నికల స్టంట్‌గా మార్చడం, దళితులకు మూడెకరాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు వంటి అంశాల్లో అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను కూడా ఈ సందర్భంగా జనం ముందుకు తీసుకెళ్లాలని బండి ప్లాన్ చేస్తున్నారు. 


రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనానికి లోనవడం... శాంతిభద్రతలను కాపాడతానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేసీఆర్ అందుకు భిన్నంగా అక్కసుతో దాడులకు పురిగొల్పుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 


కేసీఆర్ ఉపయోగిస్తున్న భాష, అంబేద్కర్ కార్యక్రమాలకు గైర్హాజర్ అవుతున్న తీరు, దళితులను మోసం చేస్తున్న అంశాలపై ఇంటింటికీ ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పేదాకా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన కార్యాచరణను రూపొందించారు ఆ పార్టీ నాయకులు. 


బీజేపీ కార్యచరణ ఇలా ఉంటే... కాంగ్రెస్ కూడా ఉద్యమానికి సిద్ధమైంది. కేసీఆర్ మాటలను నిరసిస్తూ దీక్షలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమాన పరిచేలా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దీక్షలు చేయాలని సూచించారు. 


గురవారం, శుక్రవారం రెండు రోజులపాటు గాంధీ భవన్‌సహా అన్ని ప్రాంతాల్లో దీక్షలు చేయాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజ్యాంగం మార్చలన్న మాటలను నిరసిస్తూ అన్ని జిల్లా, నియోజక వర్గ కేంద్రలలో అంబేద్కర్ విగ్రహాల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలన్నారు. 


రాజ్యాంగంపై కామెంట్స్ చేస్తూ దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చర్చ విషయం ఏమోగానీ తెలంగాణలో మాత్రం రచ్చ అవుతోంది. దీనిపై టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా దీటుగా బదులిస్తోంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నించడం తెప్పెలా అవుతుందని టీఆర్‌ఎస్‌ లీడర్లు నిలదీస్తున్నారు.