Birla Planetarium Space: ఈ విశ్వం ఎంతో పెద్దది. అనంతమైనది. కోటాను కోట్ల గ్రహాలు, పాలపుంతలతో ఈ విశాలవిశ్వం ఎవరికీ అంతుచిక్కదు. అలాంటి అనంతమైన విశ్వాన్ని కళ్లారా చూడాలంటే మనలాంటి సామాన్యులకు వీలు కాదు. శాస్త్రవేత్తలు అయితే భారీ టెలిస్కోపులో విశ్వాన్ని వీక్షిస్తుంటారు. కానీ మనమూ అంతరిక్షం గురించి చూసి, తెలుసుకుని, అర్థం చేసుకునేందుకు హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటోరియం అవకాశం కల్పిస్తోంది. భూమండలం నుంచి మన నవ గ్రహాలు, గెలాక్సీ సమూహాల్లోని అత్యంత ఉష్ణం కలిగిన ఖగోళ దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది. విశ్వంలో ఉండే అతి భారీ వస్తువులతో పాటు గెలాక్సీ కేంద్రాల్లోని సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే వేగవంతమైన వేడి వస్తువులను సైతం ఈ ప్లానిటోరియంలో వీక్షించవచ్చు. హై ఎనర్జీ రేడియేషన్ అనేది మన గెలాక్సీ, న్యూట్రాన్ స్టార్స్, సూపర్ నోవా అవశేషాలు, సూర్యుడు వంటి ముఖ్యమైన నక్షత్రాల గురించి కీలక సమాచారాన్ని అందిస్తుంది. అలాంటి శాస్త్ర విజ్ఞానాన్ని విద్యార్థులకు, ఔత్సాహికులకు అర్థం అయ్యేలా బిర్లా ప్లానిటోరియంలో విజువల్ వండర్ షోను ప్రదర్శిస్తుంటారు. 


మరో ప్రత్యేక షోను తీసుకొచ్చిన బిర్లా ప్లానిటోరియం


గ్రహాలు, నక్షత్రాల గురించి విశ్వం పుట్టుక గురించి తెలిసేలా 'ది బయోగ్రఫీ ఆఫ్ ది యూనివర్స్' పేరుతో ఓ షోను ప్రదర్శించే వారు. తాజాగా 'ది హాట్ అండ్ ఎనర్జిటిక్ యూనివర్స్' పేరుతో మరో షో ప్రదర్శిస్తున్నారు. విశ్వంతో పాటు రేడియేషన్ల కారణంగా భూమిపై మనకు తెలియని వేడి, యూనవర్స్ లో సంభవించే ప్రక్రియలను ఈ ప్రదర్శనలో కళ్లకు కట్టినట్లు వీక్షించవచ్చు. ఈ విశాల విశ్వం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ షో ఎంతో ఉపయోగపడుతుంది. అత్యధిక శక్తిగల ఖగోళ దృశ్యాలు, ఆధునిక ఖగోళ శాస్త్రంలో విజయాలు, అబ్జర్వేటరీలు, విద్యుదయాస్కాంత వికిరణం ప్రాథమిక సూత్రాలు, హై ఎనర్జీ అస్ట్రోఫిజిక్స్ వంటి అంశాలపై ప్రేక్షకులను అలరింపజేసేలా ఈ షో ఉంటుంది. బ్లాక్ హోల్స్, కొత్త నక్షత్రాల నిర్మాణం, హై ఎనర్జీ రేడియేషన్ సహా ఎన్నో కీలక అంశాలతో ఈ షోను రూపొందించారు.


ఖగోళం కళ్లముందుకు దిగి వచ్చిన అనుభూతి


బిర్లా ప్లానిటోరియంలో ఖగోళాన్ని కళ్లముందు ఉంచుంది ఈ షో. రోజూ నాలుగు షోలు వేస్తారు. ఉదయం 11.30 ఇంగ్లీష్ లో, సాయంత్రం 4 గంటలకు హిందీలో, సాయంత్రం 6 గంటలకు తెలుగులో షో ప్రదర్శిస్తారు. రాత్రి 8.15 గంటలకు ప్రేక్షకుల కోరిక మేరకు ఏదైనా ఒక భాషలో షో ప్రదర్శిస్తారు. బిర్లా ప్లానిటోరియం అంటే ఓ డోమ్ లాంటి నిర్మాణం ఉంటుంది. అందులో ఆకాశం వైపు చూస్తున్నట్లుగా కూర్చునేలా సీటింగ్ అరెంజ్‌మెంట్ ఉంటుంది. షో ప్రారంభం కాగానే డోమ్ తలుపులు తెరచుకుని ఆకాశంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. భూమి పై నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. హైదరాబాద్ లోని బిర్లా టెంపుల్ సమీపంలో ఉంటుంది బిర్లా ప్లానిటోరియం. విద్యార్థులకు, ఖగోళం గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు ఇదో అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.