Bhatti Vikramarka On MLA Rajagopal Reddy Issue: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు స్పందించారు. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఏదైనా మనస్తాపానికి గురయి ఉంటే తనతో అన్ని విషయాలు మాట్లాడతామని అన్నారు. ఆయన్ని పార్టీ నుంచి బయటికి పంపించేందుకు ఇష్టం లేదని, సాధ్యమైనంత వరకు పార్టీలోనే ఉండేలా చూస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని భవిష్యత్తులో కూడా ఆయన సేవల్నలి తాము వినియోగించుకోవాలనే చూస్తున్నట్లుగా వెల్లడించారు.


బండి సంజయ్‌ ఉన్మాది.. 
తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు చేస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ఉన్మాది అంటూ అభివర్ణించారు. ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉందని తాను అనుకోవట్లేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని బండి సంజయ్‌ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు చేసే వ్యాఖ్యలపై ఫోకస్ పెట్టి సమయాన్ని వృథా చేసుకోదని అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపైనే తమ దృష్టి అని అన్నారు. 


అంతేకాకుండా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అన్నా, సోనియా, రాహుల్ గాంధీ అన్నా బాగా గౌరవం ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే తాను కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో దాదాపు 3 గంటలపాటు మాట్లాడానని అన్నారు. ఇప్పటికీ ఆయనకు ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే తామే మాట్లాడతామని, పార్టీలోనే కొనసాగేలా చేయాలని సమావేశంలో నిర్ణయించామని భట్టి వివరించారు. 


పార్టీ సీఎల్పీ లీడర్ గా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా రాజగోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌పై పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే ఆయనతో మాట్లాడారని అన్నారు. వారికి ఆయన వివరణ ఇచ్చారని భట్టి పేర్కొన్నారు. కోమటిరెడ్డి అమిత్ షాను కలిసిన అంశంపై మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలు పార్లమెంటు సెషన్ సమయంలోనూ, మరోచోట ఇతర పార్టీల వారిని సాధారణంగా కలుస్తుంటారని, అంత మాత్రాన దాన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని అన్నారు.