Bandi sanjay Kumar: గోవులను రక్షించిన ప్రశాంత్ సింగ్‌పై కాల్పులు జరిపిన ఎంఐఎం నేత ఇబ్రహీంకు రివాల్వర్ ఎలా వచ్చిందని ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు విఫలమైతే ఆ పని చేస్తున్న ప్రశాంత్ సింగ్‌పై పోలీసులే అభాండాలు మోపడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పాలనలో గూండాలు, రౌడీలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు చేయలేని పనిని భజరంగ్ దళ్ కార్యకర్తలు చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. తక్షణమే డీజీపీ క్షమాపణ చెప్పడంతోపాటు ఆ వ్యాఖ్యలను ఉఫసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్‌కు వ్యతిరేకంగా డీజీపీ కార్యాలయాన్ని ముట్టిడికి బీజేపపీ నాయకులు యత్నించారు. వాళ్లను మార్గమధ్యలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమను అరెస్టు చేయడంపై నేతలు మండిపడ్డారు.
అంతకంటే ముందు బీజేపీ సీనియర్ నేతలు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ సింగ్‌ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోనూ సింగ్ వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని, అతనికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
గోవులను చట్టానికి విరుద్దంగా కబేళాకు తరలిస్తున్నారని గోవులను రక్షించే ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్న ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం, పోలీసులు చేయాల్సిన పనిని చేతులెత్తేస్తే... ఆ పనిని నెరవేరుస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు చట్టానికి లోబడి గోమాతలను రక్షిస్తుంటే దాడులు చేసి చంపాలని చూస్తున్నారన్నారు. గతంలో సంజయ్ అనే వ్యక్తిపై కార్లు పైకి ఎక్కించి చంపాలని చూశారన్నారు.
గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే ముస్లిం ఓట్లు పోతాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ భయపడుతున్నాయని నేతలు మండిపడ్డారు. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంఐఎం నేతలు గోవులను వధించారన్నారు. అడ్డుకున్న వాళ్లపై కాల్పులు జరుపుతున్నారని... దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. సహనానికి హద్దు ఉంటుందని... పరికితనంగా భావిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. గోవులను గోశాలకు తరలిస్తామని చెప్పడం కాదని గోవధ చట్టాన్ని అమలు చేసి చేతల్లో చూపాలని సీఎంకు సవాల్ చేశారు. సోనూ సింగ్ (ప్రశాంత్ సింగ్) రూ.5 లక్షలు డిమాండ్ చేశారని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇబ్రహీం వ్యాపారానికి రూ.కోటి నష్టం వాటిల్లిందని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. గోవులను వధించడం తప్పని చెప్పకుండా, గన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకుండా నిందితుడికి వత్తాసు పలకడం దుర్మార్గమని విమర్శించారు. హిందువుల మనోభావాలను, హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, గోరక్షకులను అవమానిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని అన్నారు బీజేపీ నేతలు.
గోవులను వధించే వాళ్లను పట్టుకోకుంటే భజరంగ్ దళ్ కార్యకర్తలు చేతులు ముడుచుకుని కూర్చోరని, వాళ్లే పట్టుకుని తగిన గుణపాఠం చెబుతారని అన్నారు బీజేపీ నేతలు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తే... ఏం చేసే వాళ్లమో మీరే చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. "అసలు రివాల్వర్ ఎక్కడి నుండి వచ్చింది? పోలీసుల వైఫల్యం కాదా? గోవుల దందా చేసేటోడి వద్ద రివాల్వర్ ఉందంటే పోలీసులు, ప్రభుత్వం అట్టాంటి వాళ్లను ఎట్లా పెంచి పోషిస్తుందో అర్ధం చేసుకోవాలి. ఇదే అంశంపై డీజీపీకి వినతి పత్రం అందించేందుకు వెళుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకుని అరెస్ట్ చేయడం దుర్మార్గం. ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గాలవల్లే గోవధ యథేచ్చగా జరుగుతోంది." అని బండి సంజయ్ ఆరోపించారు.
కె.లక్ష్మణ్ ఏమన్నారంటే... "రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? ఇప్పటికే 500కుపైగా హత్యలు జరిగాయి. యథేచ్చగా గన్ కల్చర్ పెరిగిపోయింది. పోలీసులు కూడా దాడులకు గురవుతున్నారు. హోంశాఖ సీఎం వద్దే ఉంది. రియల్ ఎస్టేట్ గొడవల్లో కాల్పులు, ఎక్కడపడితే అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. సీఎంకు ఆర్ధిక లావాదేవీలు, ఢిల్లీ యాత్రలు తప్ప పాలన పట్టడం లేదు. రాష్ట్రంలో పాలన పడకేసింది. మంత్రులంతా వివాదాల్లో, విమర్శల్లో కూరుకుపోయారు. శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. గోవధ నిషేధ చట్టం అమలులో ప్రభుత్వం విపలమైతే వాల్మీకీ యువకుడైన ప్రశాంత్ సింగ్ గోమాతలను రక్షిస్తే కాల్పులు జరుపుతారా? పోలీసులు చేయాల్సిన పనిని ప్రశాంత్ చేస్తే అతనిపైనే కాల్పులు జరిపి ఆరోపణలు చేయడం సిగ్గు చేటు."