తెలంగాణ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ఆమోదించలేదని గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు కార్మిక సంఘాలు. ఉదయం నల్ల బ్యాడ్జీలతో బస్‌లను నలిపివేసి ఆయా డిపోల వద్ద ధర్నాలు చేపట్టిన కార్మికులు ఇప్పుడు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. రాజ్‌భవన్‌కు చేరుకునే వివిధ మార్గాల్లో ముట్టడికి యత్నించారు. దీంతో రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్‌కి చేరుకున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు అక్కడి నుంచి కాలినడక రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు. 1000 మంది ఉద్యోగులతో పీవీ మార్గ్ వద్ద నిరసన తెలిపారు.
రాజ్‌భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఇతర ఆంక్షలను నెట్టుకొని వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ఉదయం నుంచి భారీగా మోహరించిన పోలీసులు వారిని నిలువరించేందుకు తీవ్రంగా యత్నించారు. ఇలా ఇరు వర్గాల మధ్య తీవ్ర పెనుగులాట సాగింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ సంఘాలను చర్చలకు పిలిచారు. తాను ఎందుకు ఆమోదించలేదు. ఆ బిల్లుపై తనకు ఉన్న అనుమానాలు ఏంటో వారికి వివరించనున్నారు.
ఇంతలోనే ఆంక్షలు ఛేదించుకొని రాజ్‌భవన్ వద్దకు చేరుకున్న కార్మికులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే బిల్లులు ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ వద్దే బైఠాయించారు.
ప్రస్తుతం గవర్నర్‌తో చర్చలు జరిపేందుకు పది సంఘాల నేతలను రాజ్‌భవన్ సిబ్బంది లోపలికి పిలిచారు. వేరే ప్రాంతంలో ఉన్న గవర్నర్ వారితో వీడియో కాన్పెరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. మొత్తం ఐదు అంశాలపై తనకు సందేహాలు ఉన్నాయని వాటిపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బిల్లును అనుమతిస్తామని చెబుతున్నారు.