Hyderabad News :  హైదరాబాద్‌లో లులు మాల్ ప్రారంభమయింది.  పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు. కానీ ఆ మాల్‌కు జనం పోటెత్తుతున్నారు. దీనికి కారణం అంతర్జాతీయంగా షాపింగ్ మాల్స్ లో లులుకు ప్రత్యేకమైన స్థానం ఉండటంమే. ప్రారంభించిన రోజు నుంచి  మాల్ కు జనం పోటెత్తుతున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో  స్తంబించిపోతోంది.  మాల్‌కు వెళ్లే వాహనాలతో కూకట్‌పల్లి, బాలానగర్‌, వై జంక్షన్‌ వీధుల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్లు వెళ్లేందుకు గంటకుపైగా సమయం  పడుతోంది.  లులు మాల్ ఓపెనింగ్ కారణంగా ఎన్ హెచ్ 65 సూపర్ హై ట్రాఫిక్‌ను ఎదుర్కొంటోంది. మెట్రో పిల్లర్ A906 నుంచి పిల్లర్ A713 వరకు చాలా ట్రాఫిక్ ఉంటోంది. ఈ కారణంగా కూకట్ పల్లి మొత్తం స్తంభించిపోతోంది.  





 లులూ మాల్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ సైతం విపరీతమైన రద్దీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా ఎస్కలేటర్లు మధ్యలోనే ఆగిపోతున్నాయి.  ట్రాఫిక్, పొడవైన క్యూల కారణంగా  గంటల గంటలు వృధా అయిపోతున్నాయని మాల్ కు వెళ్లిన వారు .. ఆ దారిలో వెళ్లిన వారూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.   





లులు మాల్ వైపు వెళ్లవద్దని.. చాలా మంది సహాలిస్తూ సోషల్  మీడియాలో వీడియోలు పెడుతున్నారు. మంత్రి కేటీఆర్, ట్రాఫిక్ పోలీసులు సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. 


 





 


హైదరాబాద్‌లోని లులు మాల్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, లులు గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఎ సమక్షంలో ఇటీవలే ప్రారంభించారు. ఈ మాల్ లో అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. 75 దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లను కలిగి ఉన్న స్టోర్‌లతో పాటు, మాల్‌లో 14వందల మంది సీటింగ్ కెపాసిటీతో ఐదు స్క్రీన్‌ల సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ వంటి మరెన్నో సౌకర్యాలు ఈ మాల్ లో ఉన్నాయి. ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్  మాల్స్ లో ఒకటి. అయినా ఈ మాల్‌కు వస్తున్న జనంతో కిక్కిరిసి పోతోంది.