Telangana News: ప్రధాని మోదీ గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పార్టీ సోషల్ మీడియా వాలంటీర్లకు పిలుపు ఇచ్చారు. వాస్తవాలు వివరించేందుకు సోషల్ మీడియా వాలంటీర్లు కూడా బాధ్యతగా తీసుకోవాలని అమిత్ షా (Amit Shah) నిర్దేశించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారమని అమిత్‌ షా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి నరేంద్ర మోదీ (Narendra Modi) ని ప్రధాన మంత్రిగా చూడాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 


సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో అమిత్ షా (Amit Shah) మాట్లాడారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ బీజేపీని తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం అని అన్నారు. ఏప్రిల్‌, మేలో జరిగే ఎన్నికలతో మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. అవినీతి రహిత భారత్‌ నిర్మాణమే బీజేపీ లక్ష్యం అని.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, మజ్లిస్‌ మూడూ అవినీతి పార్టీలే అని విమర్శించారు. ఉరి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని.. పాకిస్థాన్ పై తమ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి తీవ్రవాదులను మట్టుపెట్టామని అన్నారు. ముష్కరుల ఆగడాలు సహించేందుకు ఇది మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వం కాదని గుర్తు చేశారు.


సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీకి వెకేషన్ కి వెళ్తారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 వేల కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వమే సాయం చేసిందని అన్నారు. పాకిస్తాన్ నుంచి చొరబాట్లను తిప్పికొట్టామని.. పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని అన్నారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని మోదీ అంతం చేశారని గుర్తు చేశారు. 2047 నాటికి విశ్వగురుగా భారత్ అవుతుందని అమిత్ షా (Amit Shah) చెప్పుకొచ్చారు.


తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం మూడు పార్టీలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ - ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని అన్నారు. ఆ మూడు అవినీతి పార్టీలే అని.. మోదీని ఓడించడమే ఆ పార్టీల ఏకైక లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కుటుంబ పార్టీలు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు అని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌ అవినీతి జాబితా పంపిస్తానని అమిత్ షా (Amit Shah) అన్నారు. వాటికి కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పాకే తమపై విమర్శలు చేయాలని అన్నారు.