Asaduddin Owaisi: గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
Himanta biswa sarma |అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వీడియోపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ముస్లింల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ఉన్నారు. ముస్లింలకు సంబంధించి ఏ అన్యాయం, తప్పిదం జరిగిన ఆయన వెంటనే రియాక్ట్ అవుతారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయంలో క్రిమినల్ ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలో హిమంత బిస్వ శర్మ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్లు కనిపించారు. ఈ వీడియోను జాతి విద్వేషంగా పేర్కొంటూ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ఫిర్యాదు చేసిన ఒవైసీ.. అస్సాం సీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కోరారు.
హిమంత బిశ్వ శర్మ చాలా కాలం నుంచి వివిధ వేదికల ద్వారా ముస్లిం వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నారని తన ఫిర్యాదులో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. బిశ్వ శర్మ గన్ తో ముస్లింలను కాల్చేందుకు టార్గెట్ చేస్తున్న తాజా వీడియో అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరువాత ఆయన ఈ వీడియో డిలీట్ చేశారని ఒవైసీ పేర్కొన్నారు.
నాగరిక సమాజానికి ఇది ఆమోదయోగ్యం కాదు - ఒవైసీ
AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం (ఫిబ్రవరి 9)న తన మీడియాతో మాట్లాడుతూ.. ఓ వీడియోలో హిమంత బిశ్వ శర్మ తుపాకీతో కనిపించారని, 'పాయింట్ బ్లాంక్ షాట్', నో మెర్సీ వంటి పదాలను ఉపయోగించారని తెలిపారు. మనం ఏ నాగరిక సమాజంలో ఉన్నాం, ఇది ఎక్కడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి వీడియోలు ఓ వర్గాన్ని నేరుగా సమాజాన్ని భయపెట్టడానికి చేసే ప్రయత్నమని అన్నారు.
I have lodged an official complaint with @CPHydCity demanding criminal action against Himanta Sarma for his (now deleted) violent video showing him shooting Muslims. Unfortunately, genocidal hate speech has become a norm. pic.twitter.com/o1OVUl6MWk
— Asaduddin Owaisi (@asadowaisi) February 9, 2026
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పులను తన ఫిర్యాదులో ఉటంకిస్తూ, ఏదైనా మతం లేదా సమాజంపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం నేరమని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. హిమంత బిశ్వ శర్మ తన అధికారిక సోషల్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోపై సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సీపీని కోరారు.
అస్సాం ముఖ్యమంత్రిపై విమర్శలు
హిమంత బిశ్వ శర్మపై అసదుద్దీన్ విమర్శలు గుప్పించడం ఇదే మొదటిసారి కాదు. గత కొంతకాలంగా శర్మ తన ప్రకటనలతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ, అక్రమ చొరబాటుదారుల అంశంపై ఆయన కఠిన వైఖరి ప్రతిపక్షాల నుంచి విమర్శలకు కారణమవుతోంది. ఈసారి వ్యవహారం మాటలు దాటి హింసాత్మక వీడియోకు చేరుకుందని, ఇది దేశ ఐక్యత, సమగ్రతకు ముప్పుగా ఒవైసీ అభివర్ణించారు. దే
హైదరాబాద్ సీపీ చర్యలపై ఉత్కంఠ
ఒవైసీ ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. విద్వేషపూరిత ప్రసంగాలు దాటి, ఓ వర్గానికి చెందిన ప్రజలను సీఎం టార్గెట్ చేస్తున్నట్లు ఉన్న వీడియో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఈ ఘటన రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది.
























